లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రోజు అంతా ఆయనను కూర్చోబెట్టి లెక్కలు కూడా బయటకు లాగింది. సోదాలు అయిపోయాక విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి చిందులేసినంత పని చేశారు. తన ఇంట్లో ఏమీ దొరకలేదని ఆయనంతటకు ఆయన ప్రకటించేసుకుని.. ఉద్దేశపూర్వకంగానే సోదాలు చేశారని.. అసలు సోదాలు చేయాల్సింది చంద్రబాబు ఇంట్లో అని చెప్పుకొచ్చారు. అంతేనా.. పనిలో పనిగా తాను జూలైలో పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. మీడియాను కూడా ప్రారంభిస్తున్నానని బదిరించారు. విజయసాయిరెడ్డి తీరు చూసి.. ఈడీ అధికారులు గట్టి షాక్ ఇచ్చినట్లుగా సెటైర్లు వినిపిస్తున్నాయి.
అసలు లిక్కర్ స్కాంను బయటపెట్టింది విజయసాయిరెడ్డే. అంతా రాజ్ కేసిరెడ్డినే సూత్రధారి అని చెప్పారు. లిక్కర్ పాలసీపై మూడు సమావేశాల్లో పాల్గొన్నానని కూడా చెప్పారు. ఆయన రాజ్ కెసిరెడ్డికి వంద కోట్ల రూపాయల అప్పు కూడా అరబిందో నుంచి ఇప్పించానని చెప్పారు. ఇలా బయటకు తెలియని చాలా ఆర్థిక వ్యవహారాలు ఆయన నడిపించారు. ఇవన్నీ ఈడీ రికార్డుల్లో ఉన్నాయి.
విజయసాయిరెడ్డి తన ఇంట్లో ఏమీ దొరకలేదని ప్రకటిస్తున్నప్పటికీ, ఈడీ వర్గాల నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాదాపుగా పదమూడు గంటల పాటు ఆయనను ప్రశ్నించారంటే.. ఏమీ ఎలా ఉంటుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సోదాల సమయంలో సేకరించిన డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను విశ్లేషించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఒకవైపు కేసు విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు ఆయన కొత్త పార్టీ ప్రకటన చేయడం బెదిరింపుగానే కనిపిస్తోంది. ఇలాంటి బెదిరింపుల్ని ఈడీ అధికారులు పట్టించుకుంటారా?
