ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి, విజయవంతంగా పూర్తి చేసిన మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు గుప్పిస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రెడ్డికి కనీస వాస్తవాలు తెలుసుకోకుండా, గాలి వార్తలను పోగేసి బురద చల్లడం అలవాటుగా మారిపోయిందని విద్యా వర్గాలు మండిపడుతున్నాయి. గత ప్రభుత్వాల హయాంలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. కూటమి వచ్చాక ఉపాధ్యాయ నియామకాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో న్యాయపరమైన ఆటంకాలన్నింటినీ తొలగించి, 16 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. వీరంతా ఇప్పటికే గత ఏడాదే విధుల్లో చేరి, పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు కూడా బోధిస్తున్నారు.
ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు సంతోషంగా విధుల్లో ఉన్న తరుణంలో, సోషల్ మీడియాలో ఎవరో సృష్టించిన కొన్ని పుకార్లను పట్టుకుని జగన్ రెడ్డి అదే సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మెగా డీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని ఇలా రకరకాల కట్టుకథలను వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. అయితే, తాము చేస్తున్న ఆరోపణలపై కనీసం ఒక్కటంటే ఒక్క ఆధారమైనా బహిరంగంగా ప్రదర్శించలేకపోయారు.
ఒక అడుగు ముందుకు వేసి, విద్యాశాఖ వెబ్సైట్ నుంచి నియామకాలకు సంబంధించిన డేటాను కూటమి ప్రభుత్వం డిలీట్ చేసిందంటూ జగన్ రెడ్డి తన మేధావితనాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ఉండే పరీక్షల, నియామకాల డేటా ఎందుకు డిలీట్ అవుతుందనే కనీస సాంకేతిక అవగాహన కూడా మాజీ ముఖ్యమంత్రికి లేదు. కేవలం లక్షలాది మంది నిరుద్యోగులలో, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులలో అభద్రతా భావాన్ని, అయోమయాన్ని సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ ఈ తప్పుడు ప్రచారానికి తెరతీసిందని సులభంగానే అర్థమవుతోంది.
ఏదో ఒక ఆరోపణ చేయడం, ఆ పైన సీబీఐ విచారణ జరగాలి.. లోకేష్ రాజీనామా చేయాలి అంటూ పాత చింతకాయ పచ్చడి లాంటి డిమాండ్లు చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది. ఏళ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూసిన మెగా డీఎస్సీ ప్రక్రియను అడ్డుకోవడానికి గతంలో వైసీపీ నేతలు ఏకంగా 140కి పైగా పిటిషన్లు వేసి విఫలమయ్యారని, ఇప్పుడు నియామకాలు పూర్తయ్యాక కూడా వారి భవిష్యత్తుతో ఆడుకోవాలని చూడటం దుర్మార్గమని మండిపడుతున్నారు
