జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ యువత తిరుగుబాటు చేసి మోదీ ప్రభుత్వాన్ని ఏడాదిలో పడగొడతారని ఆశపడుతున్నారు. జెన్‌జీని విప్లవ శక్తిగా అభివర్ణిస్తున్నారు. నిరుద్యోగం, పేపర్ లీకులు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాల వల్ల ఆగ్రహంతో ఉన్న యువత వీధుల్లోకి వచ్చి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతుందని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. ఏడాదిలో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని అంటున్నారు. కానీ ఒక జాతీయ స్థాయి నాయకుడు కేవలం యువత ఆవేశంపైనే ఆధారపడి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పడం ఆయన ఫ్రస్ట్రేషన్‌కు సంకేతంలా కనిపిస్తంది.
కాక్రోచ్ పార్టీ హైప్.. నాయకత్వ లోపమా?
ఇటీవల సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ వంటి పారడీ ఉద్యమాలను చూసి, దేశంలో ఒక పెద్ద విప్లవం రాబోతోందని రాహుల్ గాంధీ భ్రమపడుతున్నారా అన్న సందేహం వ్యక్తం అవుతోంది. ఇలాంటి డిజిటల్ ఉద్యమాలు క్షణాల్లో పుట్టి అంతే వేగంగా కనుమరుగవుతుంటాయి. కేవలం ఒక మీమ్ లేదా వైరల్ ట్రెండ్‌ను నమ్ముకుని రాజకీయం చేయడం వల్ల పార్టీ క్షేత్రస్థాయిలో బలపడదని, రాహుల్ గాంధీ తనను తాను మోదీకి ప్రత్యామ్నాయంగా నిరూపించుకోవడంలో వైఫల్యం చెందుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ప్రజాస్వామ్యంలో షార్ట్‌కట్ విప్లవాలు పనిచేస్తాయా?
రాహుల్ గాంధీ ఆలోచనల్లో ఉన్న ప్రధాన లోపం వ్యవస్థాగత పోరాటం కంటే పరిస్థితుల ప్రభావం పైనే ఎక్కువ ఆశలు పెట్టుకోవడం. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రభుత్వం కంటే మెరుగ్గా ఎలా పాలిస్తారో ప్రజలకు నమ్మకం కలిగించాల్సి ఉంది. కానీ, ఆయన కేవలం ప్రజలు విసిగిపోయారు, యువత తరిమికొడుతుంది అన్న నినాదాలకే పరిమితమవుతున్నారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించాలంటే కేవలం సోషల్ మీడియా హైప్ సరిపోదని, పటిష్టమైన కేడర్, విధానపరమైన స్పష్టత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యువత ఆగ్రహం ఓట్లుగా మారుతుందా?
యువతలో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమే అయినా, దాన్ని ఓట్ల రూపంలోకి మార్చడానికి అవసరమైన క్షేత్రస్థాయి యంత్రాంగం కాంగ్రెస్‌లో లోపించింది. కాక్రోచ్ పార్టీ వంటివి కేవలం డిజిటల్ అసమ్మతి ని మాత్రమే సూచిస్తాయి. కానీ, ఎన్నికల యుద్ధభూమిలో బీజేపీ వంటి బలమైన యంత్రాంగాన్ని ఢీకొట్టాలంటే రాహుల్ గాంధీ తన నాయకత్వ శైలిని మార్చుకోవాలి. కేవలం జెన్ జీ యువత తనను నెత్తిన పెట్టుకుంటుందని ఊహల్లో ఉండటం కంటే, ఆ యువతకు ఉద్యోగాల కల్పనపై ఒక పక్కా ప్రణాళికను వివరించగలిగితేనే ఆయన నాయకుడిగా రాణిస్తారు. మొత్తానికి రాహుల్ గాంధీ కలగంటున్నట్లుగా ఏడాదిలో ప్రభుత్వం పడిపోవడం అనేది అసాధ్యం. రాహుల్ గాంధీ తన కలలను పక్కన పెట్టి, వాస్తవ రాజకీయ క్షేత్రంలోకి వచ్చి పోరాడితేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.
