ఐపీఎల్-19 నాకౌట్ స్టేజ్‌కి చేరింది. కప్పు గెలవాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితిలో జరిగిన ఎలిమినేటర్-1లో సన్‌రైజర్స్ నిష్క్రమించింది. రాజస్థాన్ చేతిలో పరాజయం చూసింది. చిన్నోడు వైభవ్ సూర్యవంశీ సింగిల్ హ్యాండ్‌తో సన్‌రైజర్స్‌ని చిత్తు చేసి కొట్టాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ కెప్టెన్ కమిన్స్‌ని సైతం ఉతికి ఆరేశాడు. 29 బంతుల్లో 97 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే సన్‌రైజర్స్ కాన్ఫిడెన్స్‌ని నీరుగార్చాడు. గేల్ పేరిట ఉన్న 30 బంతుల సెంచరీ రికార్డును త్రుటిలో మిస్ చేసినా, ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాటర్‌గా వైభవ్ (65 సిక్సులు) ఘనత సాధించాడు. గేల్ పేరిట ఉన్న 59 సిక్సుల రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 12 సిక్సులు బాదేశాడు.
వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో ఆ జట్టు 243 పరుగులు చేసింది. చేజింగ్‌కి దిగిన సన్‌రైజర్స్ అభిషేక్ డక్అవుట్తో మొదలుపెట్టింది. ఇషాన్ కిషన్, హెడ్, క్లాసెన్, నితీష్ రెడ్డి కాసేపు క్రీజులో నిలబడినా ఫలితం లేకపోయింది. ఫైనల్‌గా రాజస్థాన్ 47 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఎలిమినేటర్ 1, క్వాలిఫయర్-1 మ్యాచ్‌లను గమనిస్తే గుజరాత్, హైదరాబాద్ చేసిన కొన్ని కామన్ తప్పులు కనిపిస్తాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచింది మ్యాచ్ ఓడిపోయిన జట్లే. టాస్ గెలిచి ఫీల్డింగ్‌ని ఎంచుకున్నాయి. బేసిక్‌గా పిచ్ కండీషన్స్, టార్గెట్ అంచనా, బౌలింగ్ స్ట్రెంత్ వాడుకోవడానికి జట్లు తొలుత ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడతాయి. కాకపోతే ఐపీఎల్ సంప్రదాయానికి భిన్నంగా ఆట సాగుతోంది.
ఫీల్డింగ్ తీసుకున్నప్పుడు ముందుగా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ బలం ఏమిటో అంచనా వేయాలి. ఈ అంచనా వేయడంలో రెండు జట్లు తడబడ్డాయి. ఆర్సీబీ ఓపెనర్స్ పవర్‌ప్లేలో నిలబడితే ఈజీగా వంద పరుగులు రాబట్టగలరు. రాజస్థాన్ కూడా అంతే. వైభవ్ పవర్‌ప్లే పూర్తిగా ఆడితే చాలు.. అక్కడే మ్యాచ్‌ని లాగేస్తాడు. తాజా మ్యాచ్‌లో అదే జరిగింది.
నిజానికి హైదరాబాద్ బలం బ్యాటింగ్. ప్రత్యర్థి చేధించలేని టార్గెట్ ఇచ్చే సత్తా హైదరాబాద్‌కి ఉంది. కానీ ఆ బలాన్ని వాడుకోకుండా బౌలింగ్‌లో కట్టడి చేయాలని అనుకున్నారు. లీగ్ మ్యాచ్‌ల్లో ఇది వర్క్ అవుతుంది. కానీ ఎలిమినేటర్, అంతకుముందు జరిగిన క్వాలిఫయర్-1లో 200 పరుగులు దాటితే చేజింగ్‌కి వచ్చిన బ్యాట్స్‌మెన్ ఖచ్చితంగా అంత పెద్ద టార్గెట్లు చూసి ఒత్తిడికి లోనవుతారు. నిన్నటి మ్యాచ్‌లో కూడా అదే జరిగింది.
ఆర్చర్ బంతులు సూపర్ ఫాస్ట్‌గా వస్తున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే అతని బంతులను ఆచితూచి ఆడే అవకాశం ఉండేది. కానీ ఒక్క బంతి డాట్ అయినా ఒత్తిడి పెరిగిపోయే పరిస్థితిలో బ్యాటింగ్‌కి దిగి అభిషేక్, హెడ్ ఇద్దరూ తమ వికెట్లు ఆర్చర్ చేతిలో పెట్టి పెవిలియన్‌కు చేరారు. ఇలాంటి కీలక మ్యాచ్‌లో ఓపెనర్స్ కనీసం 50 పరుగుల భాగస్వామ్యం చేయకపోతే మ్యాచ్ నిలబడదు. గుజరాత్ మ్యాచ్‌లో కూడా ఇదే సీన్ కనిపించింది. తొలుత ఫీల్డింగ్‌ని ఎంచుకుని ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే బ్యాట్స్‌మెన్‌ని అదుపు చేయలేక చేజేతులా మ్యాచ్‌ని సమర్పించుకున్న వైనం ఇరు జట్లలో కనిపించింది.
ఐపీఎల్ అనేది పూర్తిగా బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మారింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాట్స్‌మన్ క్రీజ్‌లోకి వచ్చి ఊహించలేని టార్గెట్‌ని ప్రత్యర్థి ముందు ఉంచుతున్నాడు. ఈ సీజన్ మొత్తం అదే సీన్ కనిపించింది. ఒత్తిడి జయించడమే సక్సెస్ సూత్రంగా కనిపిస్తున్న ఈ ఫార్మాట్లో పిచ్ కండీషన్స్ అర్థం చేసుకోవడానికి ఎంచుకుంటున్న తొలి ఫీల్డింగ్ డెడ్లీ రిస్క్ అని మరోసారి రుజువైంది.
