వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా’ క్రీడల పేరుతో జరిగిన భారీ అవినీతిపై విజిలెన్స్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. దాదాపు 47 రోజుల పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా క్రీడల పేరుతో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం అయినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం గుర్తించింది. ఈ కార్యక్రమం కోసం సుమారు రూ. 125 కోట్ల వరకు ఖర్చు చేయగా, అందులో దాదాపు 40 కోట్ల నుంచి రూ.60 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం. దీనిపై విజిలెన్స్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపి, వేల పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో మాజీ క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అప్పటి శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
కిట్లు అన్నీ నకిలీవే…!
ఈ స్కామ్లో ప్రధానంగా నాసిరకం స్పోర్ట్స్ కిట్ల సరఫరా విజిలెన్స్ దృష్టిని ఆకర్షించింది. బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లను వాడి, అత్యంత నాణ్యత లేని బ్యాట్లు, బంతులు, టీ-షర్టులను సరఫరా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. పంపిణీ చేయాల్సిన కిట్లను పక్కదారి పట్టించడం, ప్రైజ్ మనీని విజేతలకు అందకుండా అడ్డుకోవడం వంటి అంశాల్లో భారీ అక్రమాలు జరిగినట్లు విచారణలో తేలింది. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిధులు కేటాయించినట్లు కూడా విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చింది. ఈ వ్యవహారంలో ప్రజా ధనం ఏ విధంగా పక్కదారి పట్టిందో గణాంకాలతో సహా నివేదికలో పొందుపరిచారు.
విజేతలుగా వైసీపీ కార్యకర్తలు
కేవలం ఆర్థిక పరమైన అవినీతి మాత్రమే కాకుండా, క్రీడల స్ఫూర్తిని దెబ్బతీస్తూ వైసీపీ కార్యకర్తలనే విజేతలుగా ఎంపిక చేసినట్లు విజిలెన్స్ అధికారులు సంచలన విషయాలను బయటపెట్టారు. అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేసి, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని వాడుకున్నారని విచారణలో వెల్లడైంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కొందరు అధికారులు కంప్యూటర్లలోని సమాచారాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నించారని, అయినప్పటికీ అధికారులు రికార్డులను వెలికితీసి అవినీతి బాగోతాన్ని బయటపెట్టారని సమాచారం.
త్వరలో రోజా, బైరెడ్డిలపై కేసులు
ప్రస్తుతం ఈ విజిలెన్స్ నివేదిక ప్రభుత్వం వద్ద ఉంది. దీని ఆధారంగా మాజీ మంత్రి రోజా, బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కేసును ఏసీబీ లేదా సీఐడీ కి అప్పగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ విజిలెన్స్ సమర్పించిన ఆధారాలు పక్కాగా ఉంటే, ఈ కేసులో అరెస్టులు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. పదివేల పేజీలకు పైగా ఉన్న ఈ సుదీర్ఘ నివేదికలో ప్రతి రూపాయి లెక్కను అధికారులు పొందుపరచడం ఇప్పుడు వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది.
