ఎమ్మెల్యే కావడం అంత వీజీ కాదు

ప్రతి శుక్రవారం ఏదొ ఒక బొమ్మ సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఆ మాటకు వస్తే ఒకటన్నమాటేమిటి? రెండు మూడు సినిమాలు కూడా వస్తుంటాయి. కొన్ని బొమ్మలు చూస్తే హమ్మ..అనిపిస్తుంది. మరి కొన్ని బొమ్మలు చూస్తే దిమ్మ దిరిగిపోతుంది. ఇంకొన్ని బొమ్మలు చూస్తే, ఇలా కాకుండా అలా చేసి వుంటే అని కూడా అనిపిస్తుంది. సాధారణంగా సమీక్షల్లో ఇలాంటివి అన్నీ ముచ్చటించుకోలేం. సమీక్షకు వున్న పరిథులు అలాంటివి. ఆ పరిథులు దాటి సినిమాను చూస్తే…అదే బొమ్మ బొరుసు..

ఈవారం బొమ్మ బొరుసులో చర్చించుకోబోయే సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎమ్మెల్యే’ టైటిల్ కు మంచి లక్షణాలుంటే సరిపోదు. సినిమాకు కూడా మంచి లక్షణాలు వుండాలి. సినిమాకు మంచి లక్షణాలు అంటే కథ, స్క్రీన్ ప్లే, నటీనటులు. ఈ మూడూ మాచ్ అయితేనే మంచి లక్షణాలు వున్నట్లు. ఏ ఒక్కటి తేడా వచ్చినా అంతే సంగతులు. ఎమ్మెల్యే సినిమా కు డైరక్టర్ కొత్త కానీ, సినిమా కథ కొత్తది కాదు. ఓ అమ్మాయిని ప్రేమించడం, ఆ అమ్మాయికి వేరే బలమైన వాడితో పెళ్లి ఫిక్స్ కావడం, అప్పుడు హీరో వెళ్లి ఆ సవాల్ ఎదుర్కొని గెలిచి, హీరోయిన్ ను చేపట్టడం. సవాలక్ష మీద ఒకటి రెండు ఎక్కువే వచ్చి వుంటాయి ఇలాంటి లైన్ తో సినిమాలు.

అందుకే దర్శకుడు ఓ చమక్కు చేసాడు. కథ కొత్తది, కొత్తగా ఆలోచించాడు అని మార్కులు సంపాదించడానికి బాల కార్మిక వ్యవస్థ, చదువు అవసరం అనే పాయింట్లు ఈ కథకు జోడించాడు. దీంతో కథ మీద బరువు పెరిగింది. కానీ కథలో బరువు పెరిగినపుడు చేయాల్సిన పని తూకం సరిపోయేలా చూసుకోవడం. తొలి సగానికి, మలి సగానికి బరువు సమానంగా పంచగలగడం. కథ బరువు మోయగల హీరోను చూసుకోవడం. ఈ రెండూ మిస్సయ్యాయి ఎమ్మెల్యేలో.

ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలంటే, కళ్యాణ్ రామ్ మొహం ఎంత యంగ్ లుక్ కోసం ట్రయ్ చేసినా, ముదురుతనం కొట్టొచ్చినట్లు కనిపిస్తూవుంటుంది. పైగా తండ్రి హరికృష్ణ జీన్స్ నుంచి వచ్చిన కళ్ళు. అప్పటికీ చాలా సార్లు కళ్ల జోడు తగిలించారు అనుకోండి. దీని వల్ల ఏమయింది.పాటల్లో హీరోయిన్ మానాన తను గెంతుతూ వుంటుంది. హీరో తన డ్యాన్స్ తాను చేస్తుంటాడు. ఇద్దరు కలిస్తే ఓ జంట అన్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలగదు.

సరే రొమాంటిక్ సీన్లలో హీరో సరిపోలేదు. ఆ విషయం పక్కన పెడదాం. కథలో కీలంగా చేసిన మార్పు సందేశం జోడించడం. ఇక్కడన్నా హీరో సరిపోయాడా అంటే అదీ లేదు. ఎందుకంటే ప్రవచనాల అందరూ చేస్తే వినేయరు. ఏ గరికపాటి నో, చాగంటి నో చేస్తే తప్ప. వాళ్లను చూసి మిగిలిన వాళ్లు మొదలెట్టినా అంత సులువుగా క్లిక్ కాలేరు. సో, మహేష్ బాబు కాబట్టి గ్రామాల దత్తతం అంటే ఓకె అన్నారు. అల్లరి నరేష్ అంటే వింటారా? ఎన్టీఆర్ కాబట్టి పర్యావరణం అంటే విన్నారు. నిఖిల్ నో రాజ్ తరుణ్ నో చెబితే వింటారా?

అలాగే కళ్యాణ్ రామ్ సీరియస్ గా ఫేస్ పెట్టి, ఎమోషన్, బాధ నటిస్తూ, బాల కార్మిక వ్యవస్థ, చదువు దాని ఉపయోగమలు అంటే జనం వింటారా? డవుటే. డవుటు కాదు నిజమే.ఇప్పుడు ఎమ్మెల్యే ఫస్ట్ హాప్ చూసి ఓకె. సెకండ్ హాఫ్ సోది అనేస్తున్నారు కామన్ ఆడియన్స్.
ఇదే కనుక సెకండాఫ్ ను ఇలా మార్చితే..ఎమ్మెల్యేగా నామినేషన్ వేసాడు హీరో. వెంటనే ఈ విషయం టవున్ లో వున్న హీరో ఆపీసు జనాలకు తెలిసింది. పోసాని, అతగాడి లపాకీ వ్యవహారాలు, వెన్నెల కిషోర్, అరివీర భయంకర లాయర్ బ్రహ్మానందం అంతా పల్లెటూరికి దిగిపోయారు. హీరోకి సాయం కోసం. లాయర్ బ్రహ్మీ తన తెలివితేటలు వాడేసాడు. తొలిసగంలో బ్రహ్మీ బిల్డప్పే తప్ప, చేసిందేమీ వుండదు. హీరోనే స్కెచ్ వేస్తాడు. అందువల్ల బ్రహ్మీని ద్వితీయార్థంలో భారీ స్కెచ్ లతో విలన్ ఆట కట్టించేందకు వాడుకుని వుండాల్సింది. పోసాని ద్వందార్ధపు కామెడీ మామూలే. బావ వెన్నెల కిషోర్ బాధ మామూలే.

ఇలాంటి టైమ్ లో హీరో వల్ల జైలుకు వెళ్లిన అజయ్ బయటకు వచ్చి, పగ తీర్చుకోవడం కోసం పల్లెకు వస్తాడు. విలన్ తో కలుస్తాడు. ఇటు వాళ్లు..అటు వీళ్లు. కామెడీ ఎన్నికలు. బ్రహ్మీ ఎత్తుగడలు. అదీ సినిమా.

ఇదేం మార్పు..పరమ రొటీన్ గా అని అనేయచ్చు. అసలు లైన్ నే పరమ రొటీన్ కదా? మరి బోర్ కొట్టకుండా విజయం సాధించాలంటే ఆ లైన్ ను అలాగే తీసుకెళ్లాలి. అదీ కూడా ఇలాంటి హీరోకి. ఎలాగూ డైరక్టర్ శ్రీను వైట్లు శిష్యుడేగా. అదే ఫార్ములా వాడేసుకుని, సేఫ్ గేమ్ ఆడేయడమే. ఇక మెసేజ్ లేదు. ఎమోషన్ లేదు.

ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ. సెకండాఫ్ అదే కంటిన్యూ అవుతుంది. అల్లరి నరేష్ సినిమాకు ఎక్కువ..ఎన్టీఆర్ సినిమాకు తక్కువ అన్నట్లు వుంటుంది. ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ అందేస్తుంది.

మంచి మెసేజ్, ఎమోషన్ కావాలంటే కళ్యాణ్ రామ్ తో కష్టం. లేదూ సక్సెస్ సినిమా అయితే చాలు అంటే, ఇవన్నీ వదిలి, రెగ్యులర్ ఫార్మాట్ లోకి మారిపోవాలి. అలా కాకుండా ఇలా ట్రయ్ చేస్తే, ఫలితం ఇప్పటిలాగే వుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.