ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన యువగళం హామీని నెరవేరుస్తూ, ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం భారీ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.
ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వివిధ విడతల్లో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ముఖ్యంగా పాఠశాల, ఇంటర్ విద్యాశాఖలో అత్యధికంగా 3,004 పోస్టులు , హోమ్ శాఖలో 2,778 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు గ్రూప్-1 లో91 , గ్రూప్-2 లో750, ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇంజనీరింగ్ , ఇతర శాఖల్లో కూడా వందల సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ప్రభుత్వం స్పష్టమైన తేదీలతో క్యాలెండర్ ఇవ్వడంతో, ఇక అభ్యర్థుల వంతు వచ్చింది. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక సందిగ్ధంలో ఉన్న అభ్యర్థులు, ఇప్పుడు తమ వద్ద ఉన్న సమయాన్ని బట్టి ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ మొదలుపెట్టవచ్చు. ఒక్కో విభాగానికి కనీసం 2 నుంచి 4 నెలల సమయం లభిస్తుండటంతో, సిలబస్‌ను క్షుణ్ణంగా చదువుకుని, మాక్ టెస్టుల ద్వారా తమ సత్తా చాటుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గ్రూప్స్ , టెక్నికల్ పోస్టుల నోటిఫికేషన్లు ఉన్నందున, ఇప్పటి నుంచే ఏకాగ్రతతో ప్రిపేర్ అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమేమీ కాదు. లక్ష్యానికి అనుగుణంగా టైమ్ టేబుల్ సిద్ధం చేసుకుని, ప్రామాణిక పుస్తకాలపై పట్టు సాధించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
