ఆస్తులు కొనుగోలు చేసే ముందు చాలా మంది అనేక ఆప్షన్లు చూసుకుంటారు . నేరుగా కొత్త ఇళ్లను కొనడం, పాత ఇళ్లను కొనడంతో పాటు బ్యాంకులు వేలం వేసే ఆస్తులను కొనడం కూడా ఓ ఆప్షన్. బ్యాంకులు లోన్ చెల్లించని ఆస్తులను వేలం వేసి విక్రయిస్తూ ఉంటాయి. ఇవి మార్కెట్ ధర కంటే తక్కువకు లభిస్తాయి. బ్యాంకులు సాధారణంగా లీగల్ ఇష్యూస్ లేని ఆస్తుల్నే తనఖా పెట్టుకుంటాయి. లోన్ చెల్లించకపోతే వేలం వేలే హకక్కు బ్యాంకులకు ఉంటుంది.
బ్యాంకుల వేలం ప్రక్రియ సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ (SARFAESI Act), 2002 కింద జరుగుతుంది. బ్యాంకులు ముందుగా డిఫాల్టర్‌కు నోటీసులు ఇచ్చి, సెటిల్మెంట్ అవకాశం ఇస్తాయి. విఫలమైతే ఆస్తిని స్వాధీనం చేసుకొని వేలం వేస్తాయి. భవిష్యత్ లో దీని వల్ల ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రావు. సాధారణంగా ఇలా వేలానికి వచ్చే ఇళ్లు మార్కెట్ ధర కంటే 15 నుంచి 30 శాతం తక్కువకు లభించవచ్చు.
బ్యాంకుల వేలం ప్రక్రియ ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌గా జరుగుతుంది. బ్యాంకులు దినపత్రికలు, తమ వెబ్సైట్లలో ప్రకటనలు ఇస్తాయి. తేదీ, రిజర్వ్ ప్రైస్, ఆస్తి వివరాలు అన్నీ నచ్చితే ఆన్లైన్ వేలం కోసం బ్యాంకు పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజర్వ్ ప్రైస్‌లో సాధారణంగా 5 నుంచి 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనే ముందు ఆస్తిని చూడటం మంచిది.
బ్యాంకుల్లో ఆస్తులు కొనాలంటే నగదు అందుబాటులో ఉంచుకోవడం ముఖ్యం. లోన్ తీసుకుంటామని ప్రక్రియ ఆలస్యం అవుతుంది. బ్యాంకు కొంత సమయం మాత్రమే ఇస్తుంది. ఆ సమయంలో కట్టకపోతే బిడ్ క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది.