తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంది. సాధారణంగా స్థానిక సమస్యల చుట్టూ తిరిగే ఈ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏకంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వంటి అగ్రనేతలను ప్రచార బరిలోకి దింపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రచారానికి రావడం చూస్తుంటే, బీజేపీ ఈ ఎన్నికలను కేవలం మున్సిపల్ వార్డుల గెలుపుగా కాకుండా, రాష్ట్రంలో తన పట్టును నిరూపించుకునే ఒక సెమీఫైనల్‌గా భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
స్టార్ క్యాంపెయినర్ల సందడి – కిషన్ రెడ్డి మార్క్ వ్యూహం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రచార పర్వాన్ని ముందుండి నడిపిస్తుండగా, బండి సంజయ్ తన కంచుకోట కరీంనగర్‌కే పరిమితమై అక్కడ పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రణాళికల్లో మార్పులు రావడం పొత్తు రాజకీయాల్లో ఆసక్తిని రేపింది. అయినప్పటికీ, ఎన్డీయే కూటమిగా క్షేత్రస్థాయిలో ఉమ్మడి పోరాటం సాగిస్తామని నేతలు చెప్తున్నారు.
చిన్న ఎన్నికలకు పెద్ద నేతలు ఎందుకు?
మున్సిపల్ ఎన్నికల్లో జాతీయ నేతలు ప్రచారం చేయడం వెనుక బీజేపీకి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. గల్లీ స్థాయి వరకు పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికలకు పునాది వేయాలని అధిష్టానం భావిస్తోంది. జాతీయ నేతలు వస్తే సాధారణ ఓటరులో పార్టీ పట్ల ఒక విధమైన నమ్మకం ఏర్పడుతుందని, బీజేపీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని వారి అంచనా. స్థానిక సంస్థలపై పట్టు సాధిస్తేనే నిధుల మళ్లింపును అడ్డుకోవచ్చని, పారదర్శక పాలన అందించవచ్చని బీజేపీ వాదిస్తోంది.
టార్గెట్ 2026 అధికారం వైపు అడుగులు:
ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన లక్ష్యం కేవలం కొన్ని మున్సిపాలిటీలను గెలవడం మాత్రమే కాదు, కాంగ్రెస్ , బీఆర్ఎస్ పార్టీలకు తామే అసలైన ప్రత్యామ్నాయమని నిరూపించడం. పట్టణ ఓటర్లు ఎప్పుడూ బీజేపీ వైపే ఉంటారనే నమ్మకాన్ని ఈ ఎన్నికల ద్వారా బలపర్చుకోవాలని చూస్తోంది. ఫిబ్రవరి 11న జరగనున్న ఈ పోలింగ్‌లో గరిష్టంగా మున్సిపల్ చైర్మన్ , మేయర్ పీఠాలను దక్కించుకోవడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన మార్కును ప్రదర్శించాలని కమలం పార్టీ పట్టుదలతో ఉంది.


