టీడీపీలో బీజేపీ బాంబు..! కల్లోలం షురూ..!

తెలుగుదేశం పార్టీలో ముసలం ప్రారంభమయింది. చంద్రబాబు నాయుడు అటు యూరప్ పర్యటనకు వెళ్లగానే.. ఇటు టీడీపీ నేతలు.. బీజేపీతో.. తమ రహస్య చర్చలను కొలిక్కి తెచ్చుకున్నారు. టీడీపీకి ఉన్న ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లో నలుగురు… బీజేపీలో చేరడం ఖాయమయింది. సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావులు… తమను.. ప్రత్యేక గ్రూప్‌గా పరిగణించాలని కోరుతూ.. ఓ లేఖను ఏ క్షణమైనా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి అందించే అవకాశం కనిపిస్తోంది. ఈ నలుగురు ప్రధాని మోదీతో పాటు.. అమిత్ షాతో కూడా మాట్లాడారు. వారికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్న భరోసా లభించడంతో.. టీడీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

రాజ్యసభ చైర్మన్ దగ్గరకు వెళ్లే సమయంలో… టీడీపీ ఎంపీ గరికపాటి మోహన్ రావు.. హైబీపీతో పడిపోవడంతో.. వెంటనే.. మిగిలిన ఎంపీలు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏ క్షణంలో అయినా ఎంపీలంతా.. తమను ప్రత్యేక గ్రూప్ గా పరిగణించాలని లేఖ ఇచ్చే అవకాశం ఉందని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఫిరాయింపుల విమర్శలు రాకుండా.. టీడీపీ ఎంపీలను బీజేపీ అనుబంధ సభ్యులుగా చేర్చుకోవాలని అమిత్ షా వ్యూహం పన్నినట్లుగా తెలుస్తోంది. నలుగురు ఎంపీల బాధ్యతను… బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించారు. మిగిలిన ఇద్దరు రాజ్యసభ సభ్యులనుకూడా.. టీడీపీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చర్చలు జరుపుతున్నారు.

మరో వైపు.. టీడీపీకి చెందిన కాపు నేతలంతా… రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే.. తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు బూరగడ్డ వేదవ్యాస్‌, బోండా ఉమా, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగల్రాయుడు, బండారు మాధవనాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, కేఏ నాయుడు, పంచకర్ల రమేష్‌బాబు, ఈలి నానితో పాటు.. మరికొంత మంది నేతలు ఈ సమవేశానికి హాజరయ్యారు.వీరందరూ కలసి కట్టుగా బీజేపీలో చేరితే ఎలా ఉంటుందా.. అన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సమావేశం జరిగే ప్రాంతంలో మీడియాకు అనుమతి నిరాకరించారు. ప్రస్తుతానికి మేమంతా టీడీపీలోనే ఉన్నామని తోట త్రిమూర్తులు వ్యాఖ్యానించి.. తమ ఎజెండా ఏమిటో చెప్పకనే చెప్పారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకే సమావేశమయ్యామంటున్నారు. పార్టీలో ఓడిన కాపు నేతలంతా సమావేశమయ్యామని… అయితే బీజేపీలో చేరే ఆలోచన లేదని.. బోండా ఉమా చెప్పుకొచ్చారు. పార్టీ మారతామన్న వార్తల్లో నిజం లేదని ఉమ చెప్పుకొచ్చారు.

తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో దెబ్బకొట్టేందుకు ఢిల్లీ స్థాయిలో భారీ ఆపరేషన్ నడుస్తోందన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లిన వెంటనే.. ఈ ఆపేరషన్‌ను ఆమలులోకి తీసుకు వచ్చారు. ఆయన వచ్చే లోపు.. మిగతా పని పూర్తి చేసే అవకాశం ఉంది. పలువురు నేతలకు బీజేపీ.. పెద్ద పెద్ద ఆఫర్లు ఇస్తోందన్న ప్రచారం జరుగుతూండటంతో.. మరికొంత మంది నేతలు కూడా.. బీజేపీ వైపు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com