వ్యక్తిగత కక్షల్ని తీర్చుకోవడానికి ప్రజలు తనకు అధికారం ఇవ్వలేదని అలాంటి వాటికి తాను దూరమని సీఎం రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్లలో చెబుతున్నారు. ఓడించడమే ఆయనపై తీర్చుకున్న రివెంజ్ అని చెబుతున్నారు. అంటే కేసీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు లేవని రేవంత్ చెప్పినట్లయింది. కానీ ఆయన మాటల్ని బీఆర్ఎస్ పెద్దలు అసలు విశ్వసించడం లేదు. రేవంత్ రెడ్డి రాజకీయాన్ని అర్థం చేసుకున్న కొంత మంది.. ఆయన మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే కాళేశ్వరం రిపోర్టుపై స్టే కోరుతూ కోర్టుకెళ్లారు.
రేవంత్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేయడం లేదని.. చెప్పాలనుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం లేదని అంటున్నారు. కానీ రేపు కేసీఆర్ ను అరెస్టు చేస్తే.. తన ప్రమేయం లేదని చెప్పడానికే ఆయన ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారని బీఆర్ఎస్ పెద్దలు అనుమానిస్తున్నారు. ఆయన చేసిన తప్పులు అలాంటివని.. చట్టపరంగా అరెస్టు చేస్తే తాను ఎలా ఆపగలనని.. అంత చాన్స్ ఉంటే ఆపేవాడ్నని ఆయన చెప్పుకోవాలనుకుంటున్నారని భావిస్తున్నారు. అందుకే రేవంత్ కేసీఆర్ అరెస్టుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని అనుమానిస్తున్నారు.
కేసీఆర్ ను అరెస్టు చేసి జైలుకు పంపడం అనేది రేవంత్ రెడ్డి టార్గెట్ అని బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికీ గట్టి నమ్మకంతో ఉన్నాయి. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. రేవంత్ రెడ్డిని ఎన్నో సార్లు అరెస్టు చేశారు. ఆ పరిస్థితుల్ని అంత తేలికగా రేవంత్ మర్చిపోరని.. అదే సమయంలో ఆయన పొలిటికల్ గా కూడా.. ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు కాబట్టి.. రివర్స్ కామెంట్లు చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అందుకే కాళేశ్వరం రిపోర్టు విషయంలో న్యాయపోరాటం కొనసాగించాలని అనుకుంటున్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కేసీఆర్ న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.