టీవీ చానల్ డిబేట్లో ఏర్పడిన వివాదం విషయంలో బీఆర్ఎస్ తాడోపేడో తేల్చుకోవాలనుకుంటోంది. ఇప్పటికే ఏబీఎన్ చానల్ ను బహిష్కరించిన బీఆర్ఎస్.. తమ పార్టీ ఎమ్మెల్సీకి జరిగిన అవమానంపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం మంగళవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఒక శాసన సభ్యుడిని చర్చకు పిలిచి, అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ట్ అవుట్ మై డిబేట్ అంటూ అవమానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని వారు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. చర్చలో భాగంగా బీఆర్ఎస్ నేతలపై బురదజల్లుతూ, జరగని విషయాలను జరిగినట్లు చూపేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకున్నానని తెలిపారు. అసత్య ప్రచారాన్ని ప్రశ్నించినందుకు గాను వ్యాఖ్యాత తన పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారని ఎమ్మెల్సీ రవీందర్ రావు చెబుతున్నారు.
గెస్ట్‌గా పిలిచి అవమానించడం తన మనసును తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎప్పుడూ పార్లమెంటరీ భాషను అతిక్రమించలేదని, కానీ అతిథుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించడం సదరు ఛానల్‌కు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌ను కూడా అవమానించిన చరిత్ర ఆ ఛానల్‌కు ఉందని ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చ పెట్టి మై డిబేట్ అనడం వ్యాఖ్యాత అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ అంటోంది. సభ్యుడిపై జరిగిన ఈ దాడిని యావత్ శాసనమండలిపై జరిగిన దాడిగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రివిలేజ్ కమిటీ ద్వారా చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు.


