కొత్త ఆలోచనలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు ఉంటారు. ఈ సారి ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా జోన్ వ్యవస్థను తీసుకు రావాలని నిర్ణయించారు. మూడు ప్రాంతాలను మూడు జోన్లుగా చేసి ప్రత్యేకాధికారులను నియమిస్తున్నారు. వారి ద్వారా అభివృద్ధి పనులు, పెట్టుబడులు, ప్రాజెక్టులు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ.. తీసుకున్న ప్రతి నిర్ణయం ముందడుగు పడేలా చేయనున్నారు.
ప్రతి జోన్‌కు ఓ స్వతంత్ర వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తర ఆంధ్ర, కోస్తా , రాయలసీమలకు ప్రత్యేక జోన్లుగా మార్చి ప్రతి జోన్‌కు స్వతంత్ర అభివృద్ధి వ్యవస్థ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సీనియర్ IAS అధికారులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. వీటిలో విశాఖ జోన్‌కు సీనియర్ ఆఫీసర్ యువరాజ్ , అమరావతి జోన్‌కు ముకేష్ కుమార్ మీనా ,రాయలసీమ జోన్‌కు ఎమ్.టి. కృష్ణబాబుకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదలకు మార్గదర్శకంగా మారనుందని ప్రభుత్వం చెబుతోంది. కేబినెట్ నిర్ణయం తర్వాత అధికారిక ప్రకటిస్తారు.
గతంలో రాజకీయ పదవులతో అభివృద్ధి మండళ్లు
గతంలో రాజకీయ పదవులతో అభివృద్ధి మండళ్లను ఏర్పాటు చేసేవారు. అయితే వాటికి పవర్స్ ఉండవు. రాజకీయ పునరావాసం కోసం ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు అలా కుండా పూర్తిగా అభివృద్ధి పనుల కోసమే జోన్లను మారుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఉన్న 13 జోన్ల వ్యవస్థను మార్చి, మూడు ప్రధాన జోన్లుగా పునర్వ్యవస్థీకరించాలనే ప్రతిపాదన ఎన్నికల నుంచే చర్చలో ఉంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మైనిఫెస్టోలో ఈ ఆలోచన ప్రస్తావించారు. ఇప్పుడు అమల్లోకి తెస్తున్నారు.
ప్రతి జోన్ కు ప్రత్యేకమైన లక్ష్యాలు
ఉత్తరాంధ్ర జోన్ లో పోర్టులు, టూరిజం, పరిశ్రమల అభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. కోస్తా జోన్లో రాజధాని అమరావతి అభివృద్ధి, వ్యవసాయం, IT హబ్‌లు వంటి అంశాలపై ఫోకస్ పెడతారు. రాయలసీమ జోన్ లో తయారీ రంగం ప్రాజెక్టులు , పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి జోన్‌కు స్వతంత్ర బడ్జెట్, ప్రాజెక్టులు, మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఈవోలు ప్రాజెక్టుల అమలు, మానిటరింగ్, కోఆర్డినేషన్‌కు బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యంగా, అమరావతి జోన్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్-2 అమలుకు మీనా కీలక పాత్ర పోషిస్తారు. యువరాజ్ విశాఖలో పోర్ట్, టూరిజం ప్రాజెక్టులపై దృష్టి పెడతారు. కృష్ణబాబు రాయలసీమలో ఇరిగేషన్, రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు.
కొత్త ప్రయత్నంతో మరింత మెరుగైన పాలన
జోనల్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలు స్థానిక స్థాయిలో మెరుగుపడతాయని, ప్రతి ప్రాంత సమస్యలకు వేగవంతమైన పరిష్కారాలు వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు. రాజకీయ జోక్యం ఉండదు. పూర్తిగా అధికారుల స్థాయిలోనే పెట్టుబడులు, ఉపాధితో పాటు అభివృద్ధి పనులను ఈ జోనల్ వ్యవస్థ చూసుకుంటుంది. సమర్థంగా అమలు చేస్తే.. అద్భుతమైన పాలనా సంస్కరణ అయ్యే అవకాశం ఉంది.
