ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల వరుస ఢిల్లీ పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. ఫిబ్రవరి 10న రోజంతా ఢిల్లీలో గడిపిన చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మంగళవారం రాత్రికి లోకేష్ కూడా హస్తినలో ప్రత్యక్షమయ్యారు. బుధవారం హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కాబోతున్నారు.
ఢిల్లీలో లోకేష్ కీలక మంతనాలు
సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో జరిపిన మెరుపు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏడుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరిపిన బాబు, ప్రధానంగా హోంమంత్రి అమిత్ షాతో గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరపడం హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ మంత్రి లోకేష్ కూడా అత్యవసరంగా ఢిల్లీ చేరుకోవడం చూస్తుంటే.. ఏపీలో త్వరలోనే కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు వెలువడనున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
లడ్డూ కల్తీ కేసులో ఈడీ ఎంట్రీ – ఢిల్లీ కసరత్తు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం కేవలం ఆహార కల్తీ అంశంగా కాకుండా, భారీ ఆర్థిక కుంభకోణంగా మారింది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. డం తెలిసిందే. ఈ కుంభకోణంలో సుమారు ₹250 కోట్ల మేర అవినీతి జరిగిందని, దీని వెనుక గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని సీబీఐ-సిట్ దర్యాప్తులో తేలినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో అమిత్ షాతో చంద్రబాబు భేటీ అవ్వడం.. ఈ కేసులో ఆర్థిక మూలాలను తవ్వి తీయడానికి, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవసరమైన కార్యాచరణపైనే చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక ఉదాసీనతకు స్వస్తి – యాక్షన్ మోడ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా, వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు నెమ్మదిగా ఉన్నాయన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. అయితే, చంద్రబాబు మాత్రం చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న చందంగా ఆధారాలను పక్కాగా సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని అంశాల్లో కేంద్ర సంస్థలైన సీబీఐ, ఈడీలు నేరుగా రంగంలోకి దిగేలా చంద్రబాబు మంత్రాంగం నడిపినట్లు సమాచారం. బుధవారం లోకేష్ కూడా అమిత్ షాను కలవబోతుండటం చూస్తుంటే, చర్యలు ప్రారంభించే ముందు తుది మెరుగులు దిద్దుతున్నట్లు అర్థమవుతోంది.
రాజకీయంగా వైసీపీకి చెక్?
వైసీపీ అగ్రనేతలపై ఉన్న పాత కేసులతో పాటు, కొత్తగా వెలుగులోకి వచ్చిన లడ్డూ స్కామ్, ఇసుక అక్రమాలపై కేంద్రం కూడా సీరియస్‌గా ఉంది. జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై ఆంక్షలు, అనర్హత వేటు వంటి రాజకీయ పరిణామాలకు కూడా ఈ పర్యటనలు పునాది వేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గత పాలకుల అవినీతిని అంతం చేసే సర్జికల్ స్ట్రైక్‌కు ఢిల్లీ వేదికగా ముహూర్తం ఖరారైనట్లు భావిస్తున్నారు. కొన్ని పెద్ద తలకాయలు జైలు బాట పట్టడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
