సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ రాజకీయాలపై ఆసక్తితో వీఆర్ఎస్ తీసుకున్నారు. కానీ ఆయన మళ్లీ ప్రైవేటు ఉద్యోగంలో చేరిపోయారు. తన జీవితంలో అత్యంత విలువైన ఏడెనిమిదేళ్లు ఆయన రాజకీయంపై పెట్టుబడి పెట్టి నష్టపోయారు. ఆయనే కాదు… జయప్రకాష్ నారాయణ కూడా లోక్ సత్తా ద్వారా ప్రయత్నించి విఫలమయ్యారు. నిజానికి చాలా మంది సివిల్ సర్వీస్ అధికారులు రాజకీయాల్లో రాణించారు..రాణిస్తున్నారు. కానీ మొత్తంగా వ్యవస్థను మార్చేస్తామని వస్తున్న వారు మాత్రమే విఫలమవుతున్నారు. దీనికి కారణం వారు రాజకీయాలను అర్థం చేసుకోలేకపోవడం, రాజకీయ పరిణామాలను తట్టుకుని నిలబడలేకపోవడమే.
పార్టీల్లో చేరిన సివిల్ సర్వీస్ అధికారులు హ్యాపీ
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లోకి వచ్చిన అధికారులను ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. మొదటి కేటగిరీలో ఇప్పటికే ఉన్నది ప్రధాన పార్టీల్లో చేరి, ఆ పార్టీల అండతో ఎన్నికల్లో పోటీ చేసేవారు. ఈ కోవకు చెందిన చాలా మంది ప్రజా ప్రతినిధులుగా గెలిచారు. మంత్రులయ్యారు. ఎంపీలయ్యారు. ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువ మంది రిజర్వుడు కేటగిరీకి చెందిన వారే. వీరు వ్యవస్థకు అనుగుణంగా మారి, రాజకీయ పార్టీల యంత్రాంగాల్లో భాగమే విజయ తీరాలకు చేరారు.
వ్యవస్థనే ప్రకాళన చేయాలనుకున్న కొంత మంది అధికారులు
రెండో కేటగిరీలో రాజకీయ వ్యవస్థనే ప్రక్షాళన చేయాలనే ఆశయంతో సొంతంగా పార్టీలు పెట్టిన వారు ఉన్నారు. ఈ విభాగంలో డాక్టర్ జయప్రకాష్ నారాయణ (, వి.వి. లక్ష్మీనారాయణ వంటి వారు ఉంటారు. జయప్రకాష్ నారాయణ గారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, ఆయన పార్టీని రాష్ట్రవ్యాప్త శక్తిగా మార్చలేకపోయారు. ఇక జేడీ గా గుర్తింపు పొందిన లక్ష్మీనారాయణ, 2019లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయి, 2024లో సొంత పార్టీతో బరిలోకి దిగి డిపాజిట్ కోల్పోయారు. వీరిద్దరి వైఫల్యం వెనుక ప్రధాన కారణం.. రాజకీయ క్షేత్రంలో కావాల్సిన మేనేజ్మెంట్ కంటే సిద్ధాంతాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం.
అడ్మినిస్ట్రేషన్ వర్సెస్ పాలిటిక్స్
అధికారులుగా ఉన్నప్పుడు వీరు రాజకీయ నేతలు చెప్పిన పనులను నిబంధనల ప్రకారం అమలు చేయడంలో గొప్ప నేర్పు చూపిస్తారు. అంటే, ఒక లక్ష్యం ఇస్తే దానిని ఎలా పూర్తి చేయాలో వారికి బాగా తెలుసు. కానీ రాజకీయం అంటే కేవలం అమలు చేయడం కాదు. ప్రజలను సమీకరించడం, ఎమోషన్స్‌ను ఓట్లుగా మార్చడం . క్షేత్రస్థాయిలో కేడర్‌ను నిర్మించడం. అధికారులు తమ కెరీర్ అంతా ఏసీ రూముల్లో, ప్రోటోకాల్ మధ్య గడుపుతారు. రాజకీయాల్లోకి వచ్చాక ఆ ప్రోటోకాల్ గోడలు బద్ధలు కొట్టుకుని సామాన్య ఓటరుతో మమేకం కావడంలో వారు తడబడుతున్నారు. అదే సమయంలో రాజకీయాల్లో కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. దాన్ని పాటించడం మాజీ అధికారుల వల్ల కావడం లేదు.
జనబలం కంటే హైప్ ఎక్కువ
కొత్త పార్టీలు పెట్టిన అధికారుల విషయంలో సోషల్ మీడియాలో , చదువుకున్న వర్గాల్లో విపరీతమైన హైప్ కనిపిస్తుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలను శాసించే గ్రామీణ ఓటర్లు, కుల సమీకరణలు , సంక్షేమ పథకాల ముందు వీరి నిజాయితీ నినాదం పలచనైపోతోంది. జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు జీరో బడ్జెట్ ఎన్నికలంటూ చేసిన ప్రయోగాలు ఆదర్శంగా ఉన్నా, ఆచరణలో ఓట్లను రాబట్టలేకపోయాయి. కేవలం మేధోవర్గాన్ని ఆకట్టుకుంటే సరిపోదని, ప్రజా రాజకీయాల్లో మాస్ అప్పీల్ ముఖ్యమని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అధికారులు తాము సర్వీసులో ఉన్నప్పుడు చూపించిన పట్టును రాజకీయాల్లో చూపలేకపోవడానికి కారణం.. వారు ఆర్డర్ ఇచ్చే స్థానం నుంచి అభ్యర్థించే స్థానానికి మారలేకపోవడమే. రాజకీయ నేతలు ప్రజల పల్స్ పట్టుకుని, వారికి ఏం కావాలో అది మాట్లాడతారు. కానీ అధికారులు ఏది మంచిదో అది చెప్పాలని ప్రయత్నిస్తారు. ఈ రెండిటి మధ్య ఉండే సన్నని గీతను దాటలేక, రాజకీయ వ్యూహకర్తలుగా రాణించే వారు సైతం.. నేరుగా రాజకీయం చేయడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా, చివరకు రాజకీయాలకు స్వస్తి పలికి తిరిగి ఉద్యోగాలకో లేదా సలహాదారుల బాధ్యతలకో పరిమితమవుతున్నారు.
