రాహుల్ గాంధీ ఓటర్ జాబితాలోని లోపాలు ఇప్పుడే పుట్టుకొచ్చాయన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. ఆయన నేరుగా ఆ లోపాలను కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనే బయట పెట్టారు. ఎగ్జిట్ పోల్స్ లో గెలుస్తామని వచ్చిన హర్యానాలో ఓడిపోయారు. మహారాష్ట్రలో ఓడిపోయారు. అక్కడి ఓటర్ జాబితాలో ఇలాంటివి ఉంటే పెట్టవచ్చు కానీ.. గెలిచిన పరిపాలిస్తున్న కర్ణాటకలో ఓటర్ జాబితాలో అక్రమాలు అని మాట్లాడటం కొంత మంది కాంగ్రెస్ నేతలకు విచిత్రం అనిపించింది. మంత్రి కేఎన్ రాజన్న ఇదే విషయాన్ని మనసులో దాచుకోలేక బయట పెట్టేశారు. పోలింగ్ జాబితాలు ప్రకటించినప్పుడు మనమే సరిగ్గా చూసుకోలేదని అన్నారు.
రాహుల్ ను తప్పు పట్టారని రాజన్న మంత్రి పదవిపై వేటు
అంతే కాంగ్రెస్ హైకమాండ్‌కు పిచ్చకోపం వచ్చేసింది. రాహుల్ గాంధీ అత్యంత అమాయకత్వంతో పోరాటం చేస్తూంటే ఆయనకు నిజాలు చెప్పాలనుకుంటారా అని ఆగ్రహించి రాత్రికి రాత్రి పదవి పీకేసింది. ఇక్కడ రాజన్న చేసిన తప్పేమిటంటే.. రాహుల్ గాంధీ వాదనను వ్యతిరేకించడం. అదే తప్పు రాష్ట్ర స్థాయిలో తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి చేస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అదో డైలీ సీరియల్లాగా మాట్లాడుతున్నారు. కానీ ఆయనపై చర్యలు తీసుకోవడంలేదు.
రేవంత్ పై అవాకులు, చెవాకులు పేలుతున్న రాజగోపాల్ రెడ్డిపై సైలెన్స్
గత ఆదివారం క్రమశిక్షణా కమిటీ సమావేశం అయింది. కేవలం కొండా మురళీ అంశంపై చర్చించారు. రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పుకొచ్చారు. ఆయనపై చర్యల గురించి మీనాక్షి నటరాజనే ఆలోచించాలన్నారు. ఈ మాత్రం సపోర్టు చాలదా.. రాజగోపాల్ రెడ్డి రెచ్చిపోవడానికి. ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీ అంటే చొక్కాలు చించుకునే రకం కాదు. తనకు పదవి ఇచ్చే పార్టీనే ఆయన పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పీక నొక్కడానికి బీజేపీకి ఆయుధంగా మారిన వ్యక్తి. మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనాలు వచ్చాక బీజేపీని ముంచేసి మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు.
లోపం అంతా కాంగ్రెస్ హైకమాండ్ లోనే !
రాహుల్ ను వ్యతిరేకిస్తే ఇట్టే .. గంటల్లోనే పదవుల నుంచి పీకేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఇలా తమ సొంత పార్టీలో …ముఖ్యనేతలపై విమర్శలు చేస్తూ.. ప్రభుత్వాన్ని నడుపుతున్న వారిని ఎందుకు ఊపేక్షిస్తోంది. పార్టీలో ఒకరిపై ఒకరిని ఎగదోయడం ద్వారా తాము బలంగా ఉంటామని అనుకుంటున్నారేమో కానీ.. తమ పార్టీలోనే చిచ్చు పెట్టుకుంటున్నారని మాత్రం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు దేశంలో అయినా..సొంత పార్టీలో అయినా ఇంతే ఉంటాయని సర్ది చెప్పుకోవాలేమో ?