గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. గోడపై ముఖ్యమంత్రి ఫోటో లేదన్న నెపంతో కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయంపై భౌతిక దాడి చేశారు. తమ వెంట తెచ్చుకున్న ఫోటోను క్యాంప్ కార్యాలయంలో పెట్టారు. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తుముకుంట అంక్షా రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ దాడి ఇప్పుడు కాంగ్రెస్ ప్రబుత్వాన్ని కార్నర్ చేయడానికి బీఆర్ఎస్కు ఉపయోగపడుతోంది.
నిజానికి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు అనేది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా పెద్దగా వినియోగంలో లేదు. ఆయన అక్కడకు వచ్చిందేలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ నియోజకవర్గానికి రాలేదు. ఆ కార్యాలయం ఎప్పుడూ ఖాళీగానే ఉంటుందని స్థానికులకు తెలిసిన విషయమే. అస్సలు వినియోగంలో లేని, ప్రజల రాకపోకలు తక్కువగా ఉండే ఒక భవనంలో సీఎం ఫోటో లేదని రాద్ధాంతం చేయడం, అద్దాలు పగలగొట్టడం వంటి చర్యలు కాంగ్రెస్ పెద్దలకు ఇబ్బందికరంగా మారాయి.
ఈ దాడి ఘటనపై బీఆర్ఎస్ ఒక్క సారిగా యాక్టివ్ అయింది. రేవంత్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అందుకే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శలు ప్రారంభించారు. కొంత మంది అత్యుత్సాహంతో చేసే పనులకు కాంగ్రెస్కు మైనస్ మార్కులు పడుతున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఇలాంటి చర్యలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే కానీ, అవి భౌతిక దాడుల వరకు వెళ్లడం ఆరోగ్యకరమైన సంప్రదాయం కాదు. ప్రతిపక్షాలను గౌరవిస్తూనే, ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసనను తెలియజేయాలని, ఇలాంటి అరాచక శక్తులకు పార్టీలో తావులేదని అధినాయకత్వం గట్టి సందేశం ఇవ్వాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
