ప్రజా సేవలో ఉంటూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అధికారులు, తాము చేసేది అవినీతి అని తెలిసినా.. వ్యవస్థల మధ్య ఉన్న లొసుగులను వాడుకుని తప్పించుకోవచ్చనే ధీమాతో ఉండటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన శాంతి వ్యవహారం ఇందుకు పరాకాష్ట. తీవ్రమైన అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్కు గురైనప్పటికీ, తానేదో బాధితురాలినన్నట్లుగా న్యాయస్థానాలను ఆశ్రయించి తిరిగి పోస్టింగ్ తెచ్చుకోవడం ప్రభుత్వ అధికార గర్వాన్ని సవాలు చేయడమే. అయితే, అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
అన్నీ బయటకు తీసిన ప్రభుత్వం
తొలుత సస్పెన్షన్పై కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుని, తిరిగి విధుల్లో చేరిన ఆమె చేసిన ప్రయత్నం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. కానీ, ప్రభుత్వం ఇక్కడ పట్టు వదలకుండా ఆమె అక్రమ సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా బయటపెట్టింది. కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా, ఏసీబీ రంగంలోకి దిగి ఆమె కూడబెట్టిన బహుళ అంతస్తుల భవనాలు, బినామీ ఆస్తులు, భారీ నగదు లావాదేవీల చిట్టాను బయటపెట్టింది. ప్రభుత్వ వ్యవస్థను ధిక్కరించి సవాలు చేసిన అధికారికి, అదే వ్యవస్థ ద్వారా అసలు రంగు బయటపెట్టడం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.
జైలు పాలు చేసిన జేబు నింపుడు
అవినీతి సొమ్ముతో కోట్లు గడించిన శాంతి, చివరకు చట్టం ముందు మోకరిల్లాల్సి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. గతంలో పనిచేసిన చోట దేవాదాయ భూముల విషయంలో, ఆలయ నిధుల వినియోగంలో ఆమె చేసిన అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా విచారణలో బయటపడుతున్నాయి. జైలుకు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం ఆమెపై మరోసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఇది కేవలం ఒక అధికారిపై తీసుకున్న చర్య మాత్రమే కాదు, అవినీతికి పాల్పడి ‘మేనేజ్’ చేయొచ్చనే భ్రమల్లో ఉన్న మిగిలిన అధికారులందరికీ ఒక గుణపాఠం.
వ్యవస్థ పై గౌరవం ఉండాలి!
ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజల ఆస్తులకు కాపలాదారులుగా ఉండాలి. కానీ, శాంతి వంటి వారు దేవుడి సొమ్మును కూడా వదలకుండా మింగేస్తూ, మళ్లీ సుద్దపూసల్లాగా చట్టాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూడటం సమాజానికి చేటు. అవినీతి చేసిన వారు మిడిసిపడితే ఫలితం ఇలాగే ఉంటుందని ఈ ఘటన నిరూపించింది. ఎంతటి వారైనా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని, ప్రజాధనాన్ని దోచుకున్న వారికి జైలు గోడలే దిక్కని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి విషయంలో రాజీ పడకుండా వ్యవహరించడం వల్ల సామాన్య ప్రజల్లో పాలనపై నమ్మకం పెరుగుతుంది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపడమే కాకుండా, వారు వ్యవస్థలను తప్పుదోవ పట్టించకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయడం ఇప్పుడు తక్షణావసరం.
