అల్ప సంతోషిని కాదంటున్న దానం నాగేంద‌ర్‌..!

నాయ‌కులు ఎవ‌రైనా పార్టీలు ఎందుకు మార‌తారు చెప్పండీ… ఏదో ఒక ప‌ద‌వో, ఎన్నిక‌ల్లో టిక్కెట్టో లాంటి ప్ర‌యోజ‌నాలు లేకుండా మారతారా..? ఫ‌లానా పార్టీ మీద అభిమానం ఉంది కాబ‌ట్టి, వెళ్లి చేరిపోయా అంటే న‌మ్మ‌డానికి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉంటారా..? కాంగ్రెస్ నుంచి తెరాస‌కు వెళ్లిన దానం నాగేంద‌ర్ కూడా ఇలానే చాలా ఆశ‌లుపెట్టుకునే తెరాస‌లో చేరార‌న్న‌ది తెలిసిందే. చేర‌క ముందేమో, న‌గ‌ర మేయ‌ర్ ప‌ద‌వి కావాలంటూ బుగ్గ కారు మీద ఉన్న మోజును తెరాసకి తెలిపారు. కానీ, ఆ స‌మ‌యంలో దానంని తెరాస చేర్చుకోలేదు! ఆ త‌రువాత‌, ఏమైందీ.. కాంగ్రెస్ లో ఆయ‌న‌కి వ్య‌తిరేక‌త పెరిగింది. సరే, ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి ఇచ్చినా చాలు అనుకున్నారు. తెరాస‌లో చేరినా అదీ ద‌క్క‌లేదు. ఆ త‌రువాత ఏమ‌న్నారు… వ‌చ్చే ఎన్నికల్లో ఖైర‌తాబాద్ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ చాలు అని ఆశించారు. కానీ, ఇప్పుడు అది కూడా ద‌క్క‌ని ప‌రిస్థితి..!

ఇప్పుడు దానం ఏమంటున్నారంటే.,. త‌న‌కు టిక్కెట్ రాలేద‌న్న అసంతృప్తి అస్స‌లే లేద‌నీ, ఎలాంటి ష‌ర‌తులూ పెట్ట‌కుండా తెరాస‌లో చేరాన‌న్నారు. తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌నీ, కాబ‌ట్టి త‌న‌కు తొంద‌ర ఉండ‌ద‌న్నారు. తాను అన్ని రకాలుగా తృప్తిగా హ్యాపీగా ఉన్నాన‌నీ, అల్ప సంతోషిని అస‌లే కాద‌ని దానం అన్నారు. త‌న‌కు కేసీఆర్ ఏ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే దాన్ని నిర్వ‌ర్తించేందుకు శ్ర‌మించి ప‌ని చేస్తాన‌న్నారు. మ‌హా కూట‌మిపై మాట్లాడుతూ… అదొక అప‌విత్ర కూట‌మి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ల‌కు గుర్తింపు లేద‌నీ, ఆ పార్టీ అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌టించిన వెంట‌నే తెరాస‌లోకి వ‌చ్చి చేరేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నార‌న్నారు దానం. కాంగ్రెస్ అభ్య‌ర్థులు జాబితా విడుద‌ల కాగానే తీవ్ర‌మైన అస‌మ్మ‌తి చెలరేగుతుంద‌ని జోస్యం చెప్పారు!

పార్టీ నుంచి తాను ఏదీ ఆశించి జాయిన్ కాలేద‌ని దానం చెప్ప‌డం విన‌డానికి విడ్డూరంగా అనిపిస్తోందన్న‌ది కొంద‌రి అభిప్రాయం! పార్టీ నుంచి ఆయ‌న ఆశించింది ఏదీ ద‌క్క‌లేద‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు కూడా తాను అల్ప సంతోషిని కాదంటున్నారు! అంటే, ఎమ్మెల్యే టిక్కెట్ అనేది చాలా చిన్న‌ది అని చెప్పే ప్ర‌య‌త్నం దానం చేస్తున్నారా? అంత‌కుమించింది ఏదో ఆయ‌న ఆశిస్తున్న‌ట్టు మ‌ళ్లీ సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నిజానికి, తెరాస‌లో చేరిన‌ప్పుడే ప‌క్కాగా డీల్ కుదుర్చుకోవాల్సింది! అక్క‌డే వ్యూహం బెడిసి కొడితే.. ఇదిగో ఇలానే తాను ఏమీ ఆశించ‌లేదంటూ వ్యాఖ్యానిస్తూ మింగ‌లేకా కక్క‌లేకా ఉండాల్సిన ప‌రిస్థితి ఎదురౌతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com