ద‌ర్శ‌క‌ర‌త్న‌కు దాదాసాహెబ్ ఫాల్కే… సాధ్య‌మేనా?

దాస‌రి చ‌రిత్ర‌.. ఇప్పుడో జ్ఞాప‌కంగా మారిపోయింది. దాస‌రి మ‌న‌ల్ని వ‌దిలి వెళ్లిన‌ప్ప‌టి నుంచీ, ఈ రోజు వ‌ర‌కూ ఏదో ఓ మూల‌.. ఏదో ఓ రూపంలో దాస‌రి సంతాప స‌భ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. దాస‌రిని గుర్తు చేసుకొంటూనే ఉన్నారు. త‌న జీవిత‌కాలంలో ఎన్నో అవార్డుల్ని గెలుచుకొన్నారు దాస‌రి. కేంద్రం ‘ప‌ద్మ‌శ్రీ‌’తోనూ స‌త్కరించింది. అయితే సినీ ప‌రిశ్ర‌మ‌లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ‘దాదా సాహెబ్ ఫాల్కే’మాత్రం అందుకోలేదు. ఆ అవార్డుకు అన్నివిధాలా దాస‌రి అర్హుడు కూడా. ఈమ‌ధ్య సినీ ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేసిన సంతాప స‌భ‌లో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి ‘దాస‌రికి దాదాసాహెబ్ పాల్కే’ అనే చర్చ లేవ‌నెత్తారు. మ‌ర‌ణానంత‌ర‌మైనా స‌రే, దాస‌రికి ఈ అవార్డు వ‌చ్చేలా చిత్ర‌సీమ‌లోని పెద్ద‌లు ప్ర‌తిన బూనాల‌ని, రెండు తెలుగు ప్ర‌భుత్వాలూ అందుకు చేయూత‌నందించాల‌ని అభ్య‌ర్థించారు.

దాస‌రి శిష్యుడిగా ఆర్‌.నారాయ‌ణమూర్తి ఆలోచ‌న‌, ఆవేద‌న హ‌ర్షించ‌ద‌గిన‌వే. అయితే మ‌ర‌ణానంత‌రం దాదాసాహెబ్ ఫాల్కే ప్ర‌క‌టించిన దాఖ‌లాలు ఇంత వ‌ర‌కూ లేనే లేవు. పైగా.. దాదా సాహెబ్ లాంటి పుర‌స్కారాల‌కూ లాబియింగుల గోల ఎక్కువైంది. ఉత్త‌రాది వాళ్ల డామినేష‌న్ ఇక్క‌డా స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. వ‌చ్చే ద‌ఫా కూడా వాళ్ల‌దే రాజ్యం. దాస‌రిపై కాంగ్రెస్ ముద్ర ఉంది. చివ‌రి రోజుల్లో ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నా – ఆయ‌న కాంగ్రెస్ ప‌క్ష‌పాతి అనే ముద్ర బ‌లంగా ఉండిపోయింది. దానికి తోడు… బొగ్గు కుంభ‌కోణం దాస‌రిపై మాయ‌ని మ‌చ్చ‌లా ప‌డిపోయింది. రెండు తెలుగు ప్ర‌భుత్వాలూ.. దాస‌రికి అవార్డు రావ‌డానికి లాబియింగులు జ‌రుపుతార‌న్న విష‌యంలో ఎవ‌రికీ న‌మ్మ‌కాల్లేవు. ఒక‌వేళ అవార్డు కోసం పాటు ప‌డ‌దామ‌నుకొన్నా.. ఎవ‌రి దారి వాళ్లదే అయ్యే ఛాన్సుంది. ఒక‌వేళ రెండు తెలుగు ప్ర‌భుత్వాలూ క‌ల‌సిక‌ట్టుగా ప్ర‌య‌త్నించినా.. కేంద్రంలోని బిజేపీ పెద్ద‌లు మోకాల‌డ్డే ప్ర‌మాదం ఉంది. మూర్తిగారి ఆలోచ‌న బాగానే ఉన్నా.. పెద్ద‌ల బుద్దులే వంక‌ర్లు తిరుగుతుంటాయి. ఈ ప‌రిస్థితుల దృష్ట్యా దాస‌రికి దాదాసాహెబ్ ఇస్తే.. నిజంగా అది అద్భుత‌మే అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.