ప్రొ.నాగేశ్వర్: కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యూహమా..?

తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ తో పొత్తుపై.. భిన్నస్వరాలు వినిపించడం… వ్యూహాత్మకమా..? లేకపోతే నిజంగానే విబేధాలున్నాయా..? ఉంటే.. రేపు ఎలా ఉంటాయి.. అనే ప్రశ్నలు మిగిలే ఉంటాయి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందనే అంశంపై చంద్రబాబు సూచనలు ఇచ్చారో.. అప్పట్నుంచి విస్తృతమైన చర్చకు కారణం అవుతోంది. మంత్రులు.. అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు. మరో మంత్రి నారాయణ మాత్రం.. రాష్ట్రానికి న్యాయం చేసేవారితో పొత్తు పెట్టుకుంటామని .. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఏకీకరణ జరుగుతోంది అన్నారు. వీరిలో ఎవరిది నిజం..?

ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకోవడానికేనా..?

అందరూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోని వారే. ఒకరికొకరు భిన్నమైన ప్రకటనలు చేశారు. ఎవరి స్టేట్‌మెంట్‌ను పరిగణనలోకి తీసుకోవాలో.. ఎవరికీ తెలియదు. కానీ ఇది వ్యూహాత్మకం అవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ప్రజల్లో రియాక్షన్ ఎలా ఉంటుందని అంచనా వేసుకోవడానికి.. ఒక్కోసారి.. ఇలాంటి ఎత్తుగడలు వేయిస్తూంటారు. కొన్ని కొన్ని అంశాల్లో మీడియాలో ప్రచారం చేయించడం.. లేదా నేతలతో పరోక్ష ప్రకటనలు చేయించడం వంటి వాటి ద్వారా ప్రజల రియాక్షన్ ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. అది ఓ స్ట్రాటజీలో భాగం. అలా వచ్చిన రియాక్షన్ ను బట్టి.. తదుపరి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పాజిటివ్‌గా స్పందన వస్తే.. పెద్దగా పట్టించుకోరు. కానీ వ్యతిరేక స్పందన వస్తే.. మాత్రం వక్రీకరించారని చెప్పడమో.. లేదా వారి వ్యక్తిగత అభిప్రాయంగా తేల్చడమో చేస్తారు. బహుశా ఇప్పుడు ఏపీ మంత్రులు కూడా ఇలా.. ప్రజాభిప్రాయాన్ని టెస్ట్ చేస్తున్నారని భావించొచ్చు.

తన అభిప్రాయం ఏమిటో చెప్పని చంద్రబాబు..

చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ… ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ.. అందరి అభిప్రాయాలు అడిగారు. కానీ తన నిర్ణయం ప్రకటించలేదు. ఒక సారి చంద్రబాబు.. తన నిర్ణయం ప్రకటించిన తర్వాత.. అందరూ అంగీకరించాల్సిందే. చంద్రబాబు నిర్ణయమే ఫైనల్. ఇప్పుడు భిన్న స్వరాలు వినిపిస్తాయేమో కానీ… నిర్ణయం ప్రకటించిన తర్వాత వ్యతిరేకంగా.. ఒక్కరు కూడా మాట్లాడరు. కానీ ఇప్పుడు… భిన్నస్వరాలు ఉండటానికే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో కలిస్తే… నష్టం అనే వాదన బలంగా ఉంటే.. ఎందుకు పొత్తు పెట్టుకోవాలనే వాదనే దీనికి కారణం. ఎందుకంటే.. రాష్ట్ర విభజనలో ప్రధాన పాపం.. కాంగ్రెస్‌దేనని.. మొదటి నుంచి టీడీపీ చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ విభజన గాయాల విషయంలో కాంగ్రెస్ పార్టీనే నిందిస్తూంటారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఇప్పటికీ చంద్రబాబు.. విభజన గాయాలు అనే అంశంపైనే రాజకీయాలు చేస్తున్నారు.

ప్రత్యేకహోదా పేరుతో మద్దతు పెంచుకునే పనిలో కాంగ్రెస్..!

విభజన ఎపిసోడ్ అయిపోయింది. విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమో… బీజేపీ కూడా అంతే కారణం. బీజేపీ మద్దతివ్వకపోతే.. విభజన బిల్లు అసలు పాసయ్యేది కాదు. అయిపోయిన విభజన గురించి ఇంకా ఇంకా ఎందుకు..? ఇప్పుడు ఏపీ నిలదొక్కుకోవాలన్నా… విభదన హామీలు అమలయ్యేలా చూసుకోవాలన్నా.. కేంద్రంలో ఉండే ప్రభుత్వం మద్దతు అవసరం. తెలుగుదేశం పార్టీ కేంద్రంలోకి అధికారంలోకి రాలేదు. కానీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న జాతీయ పార్టీల మద్దతు మాత్రం పొందగలగాలి. బీజేపీ.. విభజన హామీలు అమలు చేయకుండా చేతులెత్తేసింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకహోదా ఇస్తామంటోంది. ఇచ్చేటువంటి పార్టీతో తప్పేమిటి..? అలా ఉండటం వల్ల మనకు లాభం అని ప్రచారం చేయవచ్చు. ఇప్పుడు ప్రజలు.. ప్రత్యేకహోదా సెంటిమెంట్‌తో ఉన్నారు. ఈ ప్రత్యేకహోదా ఇచ్చే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా నేరుగా.. ప్రత్యేకహోదాకు మద్దతు ప్రకటించినందున… కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే నష్టం లేదనే వాదన కూడా టీడీపీలో వినపిస్తోంది.

కాంగ్రెస్‌తో పొత్తుపై టీడీపీలో సానుకూల స్వరం కూడా ఉంది..!

కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండాలనుకుంటున్న వాళ్ల.. రాజకీయ లెక్కలను కూడా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఐదు శాతం ఓట్లు వస్తాయనుకుందాం. కొన్ని నియోజకవర్గాల్లో ఆరేడు శాతం.. మరికొన్నింటిలో మూడు, నాలుగు శాతం రావొచ్చు. ఈ ఐదు శాతంలో.. రెండు, మూడు శాతం కలిసినా… తెలుగుదేశం పార్టీకి మైలేజీ వస్తుంది. గత ఎన్నికల్లో టీడీపీకి వైసీపీకి… మధ్య ఓటింగ్ శాతంలో తేడా రెండు శాతమే. ప్రస్తుతం ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో కాస్తంత సానుకూలత ఉంది. ఇది పదిశాతానికి పోయినా.. వీటిలో రెండు, మూడు శాతం ఓట్లు కలిసి వచ్చినా.. టీడీపీ అడ్వాంటేజ్ అవుతుంది. గత ఎన్నికల్లో కలసి పోటీ చేసిన.. బీజేపీ, జనసేన మైనస్ అయ్యాయి. అలాంటి సమయంలో.. రెండు శాతం కలవడం చాలా ముఖ్యం. అదే సమయంలో విపక్షాలు.. విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఓట్లు చీలిపోతున్నాయి. ఇదంతా కలిసి వస్తుందని.. కొంత మంది చెబుతున్నారు.

చంద్రబాబు నిర్ణయం తర్వాత అంతా సైలెంట్..!

కాంగ్రెస్ పార్టీతో… పొత్తు అనేది.. ఎంత వరకూ.. ఉపయోగపడుతుంది అనేది.. ఎన్నికలు ఫలితాలు లేదా.. సర్వేల ద్వారా తేలుతుంది. ఫైనల్ గా అయితే.. ప్రజల తీర్పు ద్వారానే.. అసలు విషయం వెల్లడవుతుంది. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం లాభమని తెలుగుదేశం పార్టీ లెక్కలేసుకుంది. ఇప్పుడు బీజేపీని వదిలిస్తేనే.. లాభమని టీడీపీ అంచనా వేసుకుంటోంది. కాంగ్రెస్‌లో కలిస్తే.. మరింత లాభమని… టీడీపీ భావిస్తోంది. అది కాంక్రీట్‌గా ఏకాభిప్రాయం అని ఎవరూ చెప్పలేదు. చంద్రబాబు స్థాయి నుంచి దిగువస్థాయి వరకు రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు. ఈ భిన్నభిప్రాయాలు.. రకరకాల స్థాయిల్లో ఉంటాయి. ఒక సారి పార్టీ అధినేతగా చంద్రబాబు తన అభిప్రాయం చెప్పిన తర్వాత ఇవన్నీ ఆగిపోతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.