ఆదాయపు పన్ను శాఖ కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సామాన్యులకు , చిన్న తరహా ఆస్తి కొనుగోలుదారులకు భారీ ఊరటనిస్తూ పాన్ కార్డు నిబంధనలలో కీలక సవరణలు చేసింది. గతంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువైన స్థిరా కొనుగోలు లేదా విక్రయం జరిగినప్పుడు కొనుగోలుదారు . అమ్మకందారు ఇద్దరూ ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. అయితే, ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. అంటే, రూ. 20 లక్షల లోపు విలువైన ఆస్తి లావాదేవీలకు ఇకపై పాన్ కార్డు వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు.
టైర్-2, టైర్-3 నగరాల్లో , గ్రామాల్లో తక్కువ ధరలో స్థలాలు లేదా చిన్న ఇళ్లు కొనేవారికి ఇది పెద్ద ఊరట. రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురయ్యే డాక్యుమెంటేషన్ ఇబ్బందులు తగ్గుతాయి. ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వారు లేదా కొత్తగా పాన్ కార్డు తీసుకోని వారు చిన్న ఆస్తులను కొనేటప్పుడు ఈ నిబంధన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం కొనుగోలు, అమ్మకాలకే కాకుండా.. గిఫ్ట్ డీడ్లు, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ల విషయంలో కూడా ఈ రూ. 20 లక్షల పరిమితి వర్తిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు
1. ఆస్తి విక్రయ ధర రూ. 20 లక్షల లోపు ఉన్నప్పటికీ, ప్రభుత్వ రికార్డుల ప్రకారం దాని విలువ రూ. 20 లక్షలు దాటితే మాత్రం పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి.
2. అధిక లావాదేవీలు రూ. 20 లక్షల పైబడిన ప్రతి లావాదేవీకి పాత పద్ధతిలోనే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పుడు వివరాలు ఇస్తే రూ. 10,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
3 ఆస్తితో పాటు మోటార్ వాహనాల కొనుగోలు , హోటల్ బిల్లులు , బ్యాంక్ నగదు లావాదేవీ విషయంలో కూడా పాన్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది.
మధ్యతరగతి ప్రజలపై డాక్యుమెంటేషన్ భారాన్ని తగ్గించి, రియల్ ఎస్టేట్ రంగంలో చిన్న తరహా లావాదేవీలను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, పారదర్శకత కోసం పెద్ద ఎత్తున జరిగే లావాదేవీలపై నిఘాను మరింత కఠినం చేస్తూనే, చిన్న కొనుగోలుదారులకు ఈ వెసులుబాటు కల్పిస్తోంది.

