వీవీప్యాట్ల లెక్కింపుల‌పై ఈసీకి ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేన‌ట్టే..!

ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌కు అంతా సిద్ధ‌మైపోతోంది. ఫ‌లితాల వెల్ల‌డికి కొన్ని గంట‌లు మాత్ర‌మే గ‌డువు ఉంది. కానీ, కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఇప్ప‌టికీ ఒక విష‌యంపై స్పష్ట‌మైన స‌మాచారం రావ‌డం లేద‌నే చెప్పాలి. అదేంటంటే… సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్ర‌తీ నియోజ‌క వ‌ర్గం నుంచీ రేండ‌మ్ గా ఎంపిక చేసిన ఐదేసి వీవీ ప్యాట్ల స్లిప్పుల‌ను… ఈవీఎంలోని ఓట్ల సంఖ్య‌తో స‌రిస‌మానంగా లెక్కించాలి. ఐదు చాల‌వు క‌నీసం యాభై శాత‌మే లెక్కించాలంటూ 21 ప్ర‌తిప‌క్ష పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే, అలా సాధ్యం కాద‌ని ఈసీ కూడా చెప్పిన సంగ‌తీ తెలిసిందే. అయితే, ఇప్పుడు చ‌ర్చ ఏంటంటే… ఒక‌వేళ‌, ఆ ఐదు వీవీప్యాట్ల స్లిప్పులకు స‌రిస‌మానంగా ఈవీఎంల‌లో ఓట్ల సంఖ్య లేక‌పోతే ఏంట‌నేది? దీనిపై ఇంత‌వ‌ర‌కూ ఈసీ ద‌గ్గ‌ర ఉన్న స‌మాధానం ఏంటంటే… వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలో ఓట్ల సంఖ్య స‌రిపోయే వ‌ర‌కూ ఎన్నిసార్లైనా రీకౌంటింగ్ చేస్తామ‌ని! అలా ఎన్నిసార్లు రీకౌంట్ చేసినా లెక్క స‌రిపోక‌పోతే… వీవీప్యాట్ స్లిప్పుల‌ను అంతిమంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటామ‌ని. అయితే, ఇక్కడే విప‌క్షాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నాయి. అదే అంశ‌మై ఇవాళ్ల మ‌రోసారి ఈసీని క‌లిశాయి.

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ఒక వ్య‌క్తి ఆరోగ్యం ప‌రీక్షించ‌డానికి ర‌క్త న‌మూనా స‌రిపోతుంద‌న్న‌ది వాస్త‌మేన‌నీ, కానీ ఆ వైద్య‌ ప‌రీక్ష‌లో స‌ద‌రు వ్య‌క్తికి రోగం ఉంద‌ని నిర్ధార‌ణ అయిన త‌రువాత కూడా ఫుల్ బాడీ చెక‌ప్ చెయ్యాలా వ‌ద్దా అని ఉద‌హ‌రించారు. అదే త‌ర‌హాలో, కోర్టు ఆర్డ‌ర్ ప్ర‌కారం లెక్కించే ఐదు వీవీ ప్యాట్ల స్లిప్పులు, ఈవీఎంల‌లోని ఓట్ల సంఖ్యతో స‌రిపోక‌పోతే… ఆ నియోజ‌క వ‌ర్గంలోని అన్ని వీవీ ప్యాట్ల స్లిప్పుల‌ను లెక్కించేలా మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేయాలంటూ ఎన్నిక‌ల సంఘాన్ని కోరామ‌ని చంద్రబాబు చెప్పారు. వీవీప్యాట్ల అంశంపై ఇప్ప‌టికే చాలాసార్లు ఈసీని క‌లిశామ‌న్నారు. 5 శాతం వీవీ ప్యాట్ల లెక్కింపులో స‌మ‌స్య‌లు వ‌స్తే, ఆ నియోజ‌క వ‌ర్గానికి సంబంధించి మొత్తం లెక్కించ‌డంలో ఎన్నిక‌ల సంఘానికి ఉన్న స‌మ‌స్య ఏంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుతో స‌హా ఇత‌ర పార్టీల ప్ర‌ముఖులు కూడా ఇదే త‌ర‌హా అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు.

నిజానికి, ఈ అంశానికి సంబంధించి ఇంత‌వ‌ర‌కూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి స్ప‌ష్ట‌త లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది. దీనిపై రేపు ఉద‌యం స‌మావేశ‌మై… కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి, ఇప్ప‌టికే ఈ ప‌రిస్థితి మీద ఒక అంచ‌నాకి వారు రావాల్సి ఉండేది. 5 శాతం వీవీ పాట్ల లెక్కింపులో స‌మ‌స్య వ‌స్తే… మొత్తం నియోజ‌క వ‌ర్గంలోని స్లిప్పుల‌న్నీ లెక్కిస్తేనే ఆ ఫ‌లితంపై ఎవ్వ‌రికీ ఎలాంటి అనుమానం రాని ప‌రిస్థితి ఉంటుంది. మ‌రి, రేపు ఈసీ ప్ర‌క‌టించ‌బోతున్న ఆ మార్గ‌ద‌ర్శ‌కాలు ఎలా ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com