ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ ల మధ్య యుద్ధం ముదురుతోంది. ఒక్క రోజులోనే ఇద్దరూ ట్వీట్ల యుద్ధం చేసుకున్నారు. అందులో కీలక నిర్ణయాలు ఉన్నాయి. మస్క్ వ్యాపారాలన్నింటినీ నాశనం చేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. అలా అయితే తాను చేయగలిగింది తాను చేస్తానని మస్క్ హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ను దింపేసే సమయం వచ్చిందని అంటున్నారు. ట్రంప్ నిర్వాకాలపై వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఈ ఇద్దరి యుద్ధం చూసి అందరూ ఏదో ఒకటి జరగడం ఖాయమని అనుకుంటున్నారు.
బిగ్ అండ్ బ్యూటీఫుల్ బిల్ పెట్టిన చిచ్చు
ఇద్దరి మధ్య ఒక్క బిల్లు విషయంలో తేడా వచ్చింది. బిగ్ అండ్ బ్యూటీఫుల్ అని ట్రంప్ పేరు పెట్టుకున్న బిల్లు వల్ల అమెరికా దివాలా తీస్తుందని ఎలాన్ మస్క్ అంటున్నారు. తాను డోజ్ చీఫ్ గా మిగిల్చిన డబ్బులతో పాటు సర్వం కోల్పోతామని ఆయన అంటున్నారు. అయితే తనకు చెప్పడానికి మస్క్ ఎవరన్నది ట్రంప్ అభిప్రాయం. అందుకే ఆ బిల్లును మరింత ఈగోతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది చివరికి చినికి చినికి గాలివానగా మారి ఇద్దరి మధ్య శత్రుత్వానికి దారి తీసింది.
దిగువ స్థాయి ఆలోచనలతో పరిపాలిస్తున్న ట్రంప్
ట్రంప్ అవడానికి రాజకీయ నాయకుడే అయినా ఆయన ఆలోచనలు అత్యంత దిగువస్థాయిలో ఉంటాయి. మస్క్ తనతో విబేధించాడని వెంటనే ఆయన వ్యాపారాలను టార్గెట్ చేయడం ఎవరైనా తెలివైన రాజకీయ నేత చేస్తారా ?. ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రాజకీయ నేతల అండతో నిర్మించలేదు. వారు కూల్చివేయలేరు. ట్రంప్ కు మద్దతు పలకడం ద్వారా ఆయన ఇప్పటికి ఎక్కువగా నష్టపోయారు. ఇప్పుడు ఇంకా నష్టపోతారు. ట్రంప్ కూడా పగబట్టి మరింతగా ఆయనను నాశనం చేస్తే.. రాజకీయాల్లో తలదూర్చాలనుకునే వ్యాపారవేత్తలకు ఓ గుణపాఠంగా ఉంటారు.
ఇద్దరికీ నష్టమే.. అమెరికాకు కూడా!
అయితే ట్రంప్ లాంటి రాజకీయ నేతల వల్ల ఎంత నష్టమో..అమెరికన్లకు ఇప్పుడు అయినా మరింత క్లారిటీ వస్తుంది. ఏ మాత్రం ఆలోచనల్లో పరిణితి లేని.. అందర్నీ బెదిరింపులతో దారికి తెచ్చుకోవాలనుకునే మనస్థత్వంతో ఉండే ట్రంప్.. అగ్రరాజ్యాన్ని పరిపాలించలేరు. ఆయనకు తగ్గట్లుగా మస్క్ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకరి గొయ్యి ఒకరు తవ్వుకుంటున్నారు. దీని వల్ల ఇద్దరూ నష్టపోతారు. అంతేనా అమెరికా కూడా నష్టపోతుంది.