సోష‌ల్ మీడియాపై తొలి కేసు… నేర్చుకోవాల్సిన పాఠాలూ

సోష‌ల్ మీడియా అనీ… ఇది నా గోడ‌నీ.. ఏం రాసినా చెల్లిపోతుంద‌నీ.. ఇంత‌కాలం మిడిసిప‌డిన వారికీ, విప‌రీతార్థాల‌తో విమ‌ర్శ‌లు చేసిన వారికీ..పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చారు ఆంధ్ర ప్ర‌దేశ్ కొత్వాల్ నండూరి సాంబ‌శివ‌రావు. సోష‌ల్‌మీడియాలో ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకున్న‌ట్లే నాయ‌క‌మ్మ‌న్యుల్ని కూడా విమ‌ర్శించేయ‌చ్చ‌నుకున్న‌వారికి క‌న్ను తెరిచుకునేలా చేసిన చ‌ర్య ఇది. పొలిటిక‌ల్ పంచ్ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో చ‌లామ‌ణీలో ఉన్న ఓ పేజీలో ఆంధ్ర ప్ర‌దేశ్ పెద్ద‌ల స‌భ‌పై సెటైర్ వేసినందుకు దాని నిర్వాహ‌కుణ్ణి అరెస్టు చేసి, త‌మ ఉద్దేశ‌మేమిటో చెప్ప‌క‌నే చెప్పారు ఆంధ్ర ప్ర‌దేశ్ పోలీసులు.
భార్య‌తోనైనా స‌రే వెట‌కారం శృతిమించితే ఏం చేస్తుంది.. అప్ప‌డాల క‌ర్రుచ్చుకుని ఒక్క‌టేస్తుంది. వ్యంగ్యం, హాస్యం రెండు కోణాలు. వ్యంగ్యం తాను ల‌క్ష్యం చేసుకున్న‌వారిని ఉద్దేశించే సున్నితంగా చేసే వ్యాఖ్య‌ల కోవ‌లోకి వ‌స్తుంది. న‌లుగురినీ న‌వ్వించి మెప్పించేది హాస్యం. ఒక వ్య‌క్తిని ఉద్దేశ‌పూర్వ‌కంగా న‌లుగురిలో న‌వ్వుల పాలు చేయాల‌న్న ప్ర‌య‌త్నం అప‌హాస్య‌మ‌వుతుంది. పొలిటిక‌ల్ పంచ్ పేజీ అంశం ఈ కోవలోకే వ‌చ్చి చేరుతుంది.

ఇంత‌వ‌ర‌కూ కొంద‌రు నాయ‌కుల‌నూ, న‌టుల‌ను, ఇత‌ర అంశాల‌నూ ఎంపిక చేసుకుని మోతాదు మించి పంచ్‌లు విసిరారు. తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స‌భ్యునిగా ఎన్నికైన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్‌ల‌ను ఉద్దేశిస్తూ వేసిన కార్టూన్‌పై తెలుగు దేశం పార్టీ నేత టీడీ జ‌నార్ద‌న్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మండ‌లి ఛైర్మ‌న్ చ‌క్ర‌పాణి కూడా ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేసి, ఆ పేజీ నిర్వ‌హకుడు ఇంటూరి ర‌వికిర‌ణ్‌ను అరెస్టు చేశారు. గుంటూరు నుంచి వెళ్ళిన పోలీసులు శుక్ర‌వారం తెల్ల‌వారుఝామున ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు.

సోష‌ల్ మీడియాను అదుపు చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని నారా లోకేశ్ గ‌త కొంత‌కాలంగా అభిప్రాయ‌ప‌డుతూ వ‌స్తున్నారు. క‌నీసం దీన్ని హెచ్చ‌రిక‌గా భావించి, త‌న పోస్టింగుల‌ను అదుపులో ఉంచుకున్నా ఆయ‌నకీ ప‌రిస్థితి వ‌చ్చుండేది కాదు. ఏక‌ప‌క్షంగా ఉండే విమ‌ర్శ‌లు ఎప్పుడూ మంచిది కాద‌ని ఈ ఉదంతం తెలియ‌జేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని గ‌తంలో సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన పోస్టింగుల‌పై తెలంగాణ పోలీసులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో చూడాల్సి ఉంది.

సోష‌ల్ మీడియా అని పిలుస్తున్న ఫేస్‌బుక్‌, ట్విట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్య‌మాలలో సెల‌బ్రిటీలు చుర‌క‌లంటించ‌డం.. ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు గుప్పించుకోవ‌డం ఎక్కువైంది. అవి అక్క‌డితో ఆగ‌కుండా రాజ‌కీయాల్లో ల‌బ్ధికోసం, పార్టీల క్యాడ‌ర్లు అందిపుచ్చుకున్నాయి. సోష‌ల్ మీడియా అంటే మీడియాతో ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ స‌రితూగ‌దు. వ్య‌క్తిగ‌త ద్వేషాల‌ను, క‌క్షల‌నూ తీర్చుకునేందుకు ఉప‌యోగించుకునే ఏ మీడియా మ‌న‌జాల‌దు. మ‌న్న‌న‌లు పొంద‌జాల‌దు. 1980వ ద‌శ‌కంలో ప్ర‌ముఖ దిన ప‌త్రిక ఈనాడులో లెజిస్లేటివ్ అసెంబ్లీపై వ‌చ్చిన ఓ సంపాద‌కీయానికి `పెద్ద‌ల‌` గ‌లాభా అంటూ పెట్టిన శీర్షిక క‌ల‌క‌లానికి దారితీసింది. ఆ పత్రిక చీఫ్ ఎడిట‌ర్ రామోజీరావును స‌భ‌కు పిలిపించి మంద‌లించాల‌ని య‌త్నించింది. ఆ స‌మ‌యంలో చోటుచేసుకున్న ప‌రిణామాలు ఆనాటి ఘ‌ట‌న‌లు గుర్తున్న పాఠ‌కుల‌కు తెలుసు. తాజా కార్టూన్‌పై కూడా ప్ర‌భుత్వం ప‌రువు న‌ష్టం కేసు వేసుంటే బాగుండేదేమో. కొన్నేళ్ళ క్రితం పార్ల‌మెంటు భ‌వ‌నంపై వేసిన ఓ కార్టూన్ కూడా క‌ల‌క‌లాన్ని సృష్టించింది. దీనిపై వేసిన కేసును కోర్టు కొట్టేసింది. భార‌తీయ పౌరుడిగా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం అతడి హ‌క్క‌ని తీర్పు సంద‌ర్భంగా వ్యాఖ్యానించింది. వ్య‌క్తుల‌తో ఇలాంటి వాటిని ముడిపెట్ట‌లేం. స్వాతంత్ర్య‌ముంద‌ని ఇష్టారాజ్యంగా విమ‌ర్శ‌లకు దిగ‌డం ఇక‌పై సాగ‌ద‌ని ర‌వికిర‌ణ్ ఉదంతం తెలియ‌జెపుతోంది. ర‌వి కిర‌ణ్ వెనుక ఎవ‌రున్నారు. అత‌డిపైనే ఎందుకిలా చేసిందీ అని ఆలోచించి బుర్ర‌లు ప‌గుల‌గొట్టుకునే కంటే అవి త‌మ వ‌ర‌కూ రాకుండా ఎవ‌రికి వారు జాగ్ర‌త్త ప‌డ‌డం మంచిది.

Subrahmanyam Vs Kuchimanchi

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.