టాలెంట్ ఉన్న హీరోల్లో గోపీచంద్ ఒకడు. యాక్షన్ కథలు బాగా నప్పుతాయి. కథల ఎంపికలో చాలా క్లియర్‌గా ఉంటాడు. కానీ సరైన హిట్లే అందుకోవడం లేదు. గోపీచంద్ ఓ సాలీడ్ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. ఇప్పుడు సంకల్ప్ తో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి నిర్మాత. ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో గోపీ లుక్ బాగుంది. తనో వారియర్‌గా కనిపించబోతున్నాడన్న విషయం స్పష్టమైంది. తన ఆహార్యానికి సరిపోయే పాత్ర ఇది. గోపీచంద్‌కు చాలా కాలం తరవాత సరైన కథ పడినట్టు అనిపిస్తోంది. ఈ సెటప్, గెటప్.. ఇవి రెండూ గోపీచంద్ కు కొత్తే. సంకల్ప్ కొత్త తరహా కథలు రాస్తుంటాడు. ప్రతీసారీ ఓ కొత్త జోనర్ టచ్ చేస్తుంటాడు. ఈసారి కూడా గోపీచంద్ కోసం అలాంటి కథే ట్రై చేస్తున్నాడు. వీఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. వార్ ఎపిసోడ్స్ హైలెట్ కాబోతున్నాయని తెలుస్తోంది. ఇటీవల ఈ తరహా కథలకు మంచి గిరాకీ ఏర్పడింది. పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అయ్యింది. అందుకే గోపీచంద్ కూడా ఈ బాటలో నడవడానికి ఫిక్సయ్యాడు.
ఇటీవలే షూటింగ్ మొదలైంది. కొంత మేర చిత్రీకరణ జరిగింది. అవుట్ పుట్ పై గోపీచంద్ పూర్తి సంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. టైటిల్ తోనే గ్లింప్స్ వదలాలని చిత్రబృందం భావించింది. కానీ ఈ సినిమా కోసం సరైన టైటిల్ ఇప్పటి వరకూ దొరకలేదట. ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటన్న విషయంలో చిత్రబృందం ఇంకా గోప్యం పాటిస్తోంది. టీజర్, ట్రైలర్ ఎలాగూ వస్తాయి కదా, అప్పటి వరకూ ఎదురు చూడాల్సిందే.