తెలుగు నేలపై ఆధ్యాత్మికత పేరుతో ఒక వింతైన ధోరణి కొనసాగుతోంది. దశాబ్దాలుగా సాగుతున్న మత మార్పిళ్లు ఇప్పుడు సరికొత్త వేషధారణను అద్దుకున్నాయి. ఒకప్పుడు నిశ్శబ్దంగా సాగే ఈ ప్రక్రియ, ఇప్పుడు అచ్చంగా హిందూ ధర్మంలోని ఆచారాలను కాపీ చేస్తూ సాగుతుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అటు క్రైస్తవం తన మూలాలను వదులుకుంటోందా, లేక ఇటు హిందూ సంప్రదాయాలను తనలో కలిపేసుకుని భ్రమకు గురి చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మత ప్రచారం కోసం హిందూ ధర్మ మూలాలను వాడుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
క్రైస్తవ పద్దతులకు వ్యతిరేకంగా కార్యక్రమాలు
సాధారణంగా ఏ మతానికైనా కొన్ని ప్రత్యేక గుర్తులు, ఆచారాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో అభిషేకాలు చేయడం, కుంకుమలు దిద్దడం, వ్రతాలు నిర్వహించడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతటితో ఆగక, అయ్యప్ప స్వామి మాల లాగా ప్రత్యేక దీక్షలు పట్టడం, సంక్రాంతి పండుగ వేళ ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి హరిదాసుల వేషధారణతో వేడుకలు జరపడం వంటివి సాధారణమయ్యాయి. ఇది ఆయా మతాల సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమైనప్పటికీ, ప్రజలను ఆకర్షించడానికి ఇదొక వ్యూహంగా మారుతుండటం ఆందోళనకరం.
హిందూత్వంపై జరుగుతున్న దాడి
బలవంతపు మత మార్పిళ్లు ఒక ఎత్తు అయితే, ఇటువంటి సంకరణం ద్వారా సామాన్య ప్రజలను గందరగోళానికి గురి చేయడం మరో ఎత్తు. ఎవరి మతాన్ని వారు ఇష్టపూర్వకగా అనుసరించడం రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ, ఒక మతంలోని గుర్తులను మరో మతం అరువు తెచ్చుకుని, తమ ఉనికిని కప్పిపుచ్చుకుంటూ మార్పిడిలను ప్రోత్సహించడం అనైతికమే. ఇది కేవలం ఆధ్యాత్మిక అంశం మాత్రమే కాదు, భవిష్యత్తులో సామాజిక అస్థిరతకు, సాంస్కృతిక విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉంది. ఓ రకంగా ఇది హిందూత్వంపై జరుగుతున్న దాడే అనుకోవచ్చు.
ఎవరి మాతలను వారు ఆచరించుకోనిస్తే చాలు కదా !
ప్రజల నమ్మకాలను గౌరవించడం అంటే వారి మూలాలను చెరిపివేయడం కాదు. మతం మారిన వ్యక్తి తన పాత సంప్రదాయాలను వదులుకోలేకపోతే అది మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది, కానీ వ్యవస్థాకృతంగా పాస్టర్లు ఇలాంటి ప్రయోగాలు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఆధ్యాత్మికత అనేది ఆత్మకు శాంతిని ఇవ్వాలి కానీ, ఇలాంటి వింత పోకడలతో సమాజంలో విభజన తీసుకురాకూడదు. ఇప్పటికైనా మేధావులు, మత పెద్దలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలైన భక్తికి, ఆకర్షించే ప్రలోభాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించకపోతే మన సంస్కృతి మసకబారే ప్రమాదం ఉంది.
