తాడేపల్లి ప్యాలెస్ గోడల మధ్య ఇప్పుడు రాజకీయం సెగలు పుట్టిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా, షాడో సీఎం గా వెలుగొందిన సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని జరుగుతున్న పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థిని విమర్శించేటప్పుడు ఆధారాలు పక్కాగా ఉండాలి. తప్పుడు లెక్కలతో, పాత వీడియోలు ఉన్నాయన్న స్పృహ లేకుండా స్క్రిప్టులు సిద్ధం చేయడం వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. తనను జోకర్ గా మార్చేస్తున్నారన్న కోపం జగన్‌లో మొదలైంది.
జగన్‌ను జోకర్లా చేస్తున్న స్క్రిప్టులు
రాజకీయాల్లో నాయకుడికి సమాచారం అందించే వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత మంచిది. జగన్ విషయంలో అది రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఒడిశాకు వెళ్తుందని స్వయంగా జగన్ చెప్పిన విషయాన్ని విస్మరించి, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఏపీ తెచ్చింది తానేనని సజ్జల టీమ్ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను జగన్ చదివేశారు. దీనిని పట్టుకున్న టీడీపీ, పాత వీడియోలను బయటకు తీసి జగన్‌ను సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురిచేసింది. పరువు తీసింది. తనను ఇంతలా బుక్ చేసిన సజ్జల వైఖరిపై జగన్ పీకలదాకా కోపంతో ఉన్నట్లు చెబుతున్నారు.
విశ్వసనీయతపై దెబ్బ
రాజధాని విషయంలోనూ గతంలో జగన్ అసెంబ్లీలో చెప్పిన మాటలకు, ఆ తర్వాత తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి పొంతన లేకపోవడాన్ని ప్రతిపక్షాలు సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ప్రతిసారీ సజ్జల ఇచ్చే సలహాలు జగన్‌ను సమర్థించుకోలేని స్థితికి నెట్టేస్తున్నాయని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో తాడేపల్లి ప్యాలెస్‌లో జరుగుతున్న కీలక సమావేశాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదన్న వార్తలు గుప్పుమంటున్నాయి. జగన్ ఉన్న చోట సజ్జల ఉండకపోవడం, ఆయన కార్యక్రమాలకు దూరంగా జరగడం చూస్తుంటే.. అధినేత ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఒకప్పుడు పార్టీలో నంబర్ 2గా ఉన్న సజ్జల, ఇప్పుడు జగన్ కంట్లో పడకుండా తప్పించుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.
విజయసాయిరెడ్డి బాటలో సజ్జల
వైసీపీలో ఒకప్పుడు విజయసాయిరెడ్డి హవా ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారి జగన్ ఆగ్రహానికి గురైన తర్వాత ఆయన ప్రాధాన్యత ఎంతలా తగ్గిందో కూడా బహిరంగ రహస్యమే. ఎన్నో అవమానాలు పాలై ఆయన ఇప్పుడు బయటకు పోయి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు సజ్జల పరిస్థితి కూడా అదే దిశగా సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సజ్జల ఏదైనా కొత్త కుట్ర ను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసి జగన్ నమ్మకాన్ని గెలుచుకోకపోతే, ఆయన రాజకీయ ప్రస్థానం ప్యాలెస్ బయటే ముగిసిపోయే అవకాశం ఉందన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.


