తమిళనాడు రాజకీయాలు అంటేనే ద్రవిడ సిద్ధాంతం, నాస్తికత్వం , సామాజిక సమానత్వం. పెరియార్ వేసిన హేతువాద పునాదులపైనే దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు అధికారాన్ని పంచుకుంటున్నాయి. కొత్తగా వచ్చిన విజయ్ కూడా ఆ సిద్ధాంతాలపైనే రాజకీయం చేస్తున్నారు. కానీ వీరంతా తెలిసినా తెలియనట్లుగా నటిస్తున్న అంశం.. తమ సిద్ధాంతాల్లోకి చొరబడటం.
అధ్యాత్మికత పవర్ గుర్తిస్తున్న ద్రవిడ సిద్ధాంతం
ఒకప్పుడు దేవుడు, మతం అనే అంశాలకు దూరంగా ఉన్న ద్రవిడ పార్టీలు, ఇప్పుడు క్రమక్రమంగా ఆధ్యాత్మికత ను తమ రాజకీయ ఎజెండాలో భాగం చేసుకుంటున్నాయి. ఇది కేవలం ఏదో ఒక పార్టీ తెచ్చిన మార్పు కాదు, తమిళ ఓటర్ల మారుతున్న మనస్తత్వానికి అనుగుణంగా ప్రధాన పార్టీలన్నీ తమ పంథాను మార్చుకుంటున్న సంకేతం. అధికార డీఎంకే తన సంప్రదాయ నాస్తికవాద ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తోంది. మేము హిందువులకు వ్యతిరేకం కాదు అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఇందుకోసం హిందూ మత ధర్మాదాయ శాఖ ద్వారా వేల కోట్ల రూపాయలతో ఆలయాల పునరుద్ధరణ, కుంభాభిషేకాలు నిర్వహించడం, ఆలయ భూములను ఆక్రమణల నుంచి కాపాడటం వంటి చర్యలు చేపడుతోంది. గతంలో ఇలాంటి అంశాలకు దూరంగా ఉండే నాయకత్వం, ఇప్పుడు బహిరంగంగానే ఆలయ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ సాఫ్ట్ హిందూత్వ వైపు అడుగులు వేస్తోంది. అటు అన్నాడీఎంకే కూడా మొదటి నుంచీ జయలలిత హయాంలో ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూనే ఉంది, ఇప్పుడు ఆ వారసత్వాన్ని మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది.
ద్రవిడ సిద్ధాంతాల ఓటరుదీ అదే దారి
క్షేత్రస్థాయిలో ముఖ్యంగా గ్రామీణ తమిళనాడులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ద్రవిడ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న సామాన్య ఓటరు, ఇప్పుడు తన మతపరమైన గుర్తింపును చాటుకోవడానికి వెనకాడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న చిన్న ఆలయాల పూజారులు, భక్తుల మధ్య ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతోంది. ఈ క్రమంలోనే వెట్రివేల్ యాత్ర వంటి కార్యక్రమాలు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ మార్పును కేవలం ఒక పార్టీ ఖాతాలో వేయలేం. డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రధాన ద్రవిడ పార్టీలే స్వయంగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఆధ్యాత్మిక వేదికలను పంచుకోవడం వల్ల ఈ ట్రెండ్ మరింత వేగవంతమైంది. ద్రవిడ సిద్ధాంతాన్ని దైవ చింతనతో మేళవించి సరికొత్త రాజకీయ రంగును అద్దడానికి ఇక్కడ ప్రయత్నం జరుగుతోంది.
హేతువాదం నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్లుతున్న రాజకీయం
తమిళనాడులో నాస్తికత్వం వర్సెస్ ఆధ్యాత్మికత అనే చర్చ ఇప్పుడు ఎవరు మెరుగైన హిందూ భక్తులు అనే స్థాయికి చేరుకుంది. ద్రవిడ పార్టీలు తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఆధ్యాత్మిక ముసుగును ధరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు గుడి గోపురాల కంటే సామాజిక మార్పు ముఖ్యం అని చెప్పిన నాయకులు, ఇప్పుడు గుడి గోపురాలకు రంగులు వేయడమే అసలైన సామాజిక సేవ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ మార్పు కేవలం ఎన్నికల వ్యూహం మాత్రమే కాదు, తమిళ సమాజంలో అంతర్లీనంగా ఉన్న భక్తి భావాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడంలో ద్రవిడ పక్షాలు కూడా పోటీ పడుతున్నాయని అర్థమవుతోంది.
పెరియార్ సిద్ధాంతాలు తమిళనాడు ఆత్మలో ఉన్నప్పటికీ, రాజకీయ ఆచరణలో మాత్రం ఆధ్యాత్మికత ఇప్పుడు అనివార్యంగా మారింది. ప్రధాన పార్టీలన్నీ ఆలయాల చుట్టూ తిరుగుతుండటం, మతపరమైన సెంటిమెంట్లను గౌరవిస్తుండటం చూస్తుంటే, ద్రవిడ కోటలో ఇప్పుడు సరికొత్త ఆధ్యాత్మిక రాజకీయ యుగం నడుస్తోందని చెప్పక తప్పదు. రేపటి ఎన్నికల్లో ఎవరికి అధికారం దక్కుతుందనేది పక్కన పెడితే, తమిళ రాజకీయాల గమ్యం మాత్రం హేతువాదం నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్లుతోంది అనడంలో సందేహం లేదు.


