భారతీయ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకుడు బోడె రామచంద్ర యాదవ్ భారీగా ధనబలం ఉన్న నాయకుడిగా ప్రచారం చేసుకుంటూ .. రాజకీయంగా హడావుడి చేస్తున్నారు. సొంత నియోజకవర్గంలో పట్టించుకునేవారు ఉండరు కూడా అమరావతికి వచ్చి దీక్షలు చేస్తూ.. హడావుడి చేస్తున్నారు. కుల రాజకీయాలతో నాయకుడినని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పుంగనురూలో రెడ్లు కొడితే బీసీ కార్డు వాడలేదే!
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఎదిరించడం ద్వారా రామచంద్ర యాదవ్ వెలుగులోకి వచ్చారు. గతంలో ఆయనపై దాడులు జరిగినప్పుడు సానుభూతి లభించినప్పటికీ, ఆ పోరాటాన్ని ఆయన కేవలం రెడ్డి వర్సెస్ యాదవ్ అన్న కోణంలోకి మళ్లించలేదు. వైసీపీ యాదవులపై దాడులు చేస్తోందని ఆయన పోరాటం చేయలేదు. చివరికి ఎంత హడావుడి చేసినా పుంగనూరులో ఆయనకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు. సొంత నియోజకవర్గంలో ఐదు వేల లోపు ఓట్లు రావడం, మంగళగిరిలో కేవలం 300 ఓట్లకే పరిమితం కావడం ఆయన క్షేత్రస్థాయి బలాన్ని ప్రశ్నిస్తున్నాయి.
బీసీల పేరుతో కొత్త రాజకీయ ప్రయత్నం
రామచంద్ర యాదవ్ ఇప్పుడు ప్రధానంగా బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే, ధనవంతుడైన ఆయన బీసీల కోసం , కనీసం తన సొంత యాదవ్ సామాజిక వర్గం కోసం చేసిన సేవా కార్యక్రమాలు ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేసుకునే ఆయన, సామాజిక ప్రయోజనాల కోసం , కుల బాంధవుల కష్టాల్లో రూపాయి సాయం చేసిన దాఖలాలు లేవు. నిస్వార్థంగా సాయం చేసిన చరిత్ర లేకుండా, కులాల పేరుతో రోడ్డు మీదకు రావడం పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయడం విచిత్రం.
అమరావతిపై వ్యతిరేకత – రాజకీయ వ్యూహం
రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో రామచంద్ర యాదవ్ అనుసరిస్తున్న వైఖరిపై కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి అభివృద్ధికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ఉనికి కోసమే. కులాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా,ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం ద్వారా తన రాజకీయ లబ్ధిని వెతుక్కుంటున్నారు.
అసలు రామచంద్రయాదవ్ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు !
బోడె రామచంద్ర యాదవ్ బ్యాక్ గ్రౌండ్‌పై స్పష్టత తక్కువగా ఉంది. ఆయన చేసే వ్యాపారాలు ఏమిటి? అంతటి భారీ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలపై పారదర్శకత లేకపోవడం కూడా ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ధనబలంతో రాజకీయం చేయవచ్చనే ధీమాతో ఆయన వ్యవహరిస్తున్న తీరు, సామాన్య బీసీ వర్గాలకు మేలు చేయడం కంటే, వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే కుట్ర పన్నుతున్నారు. సామాజిక బాధ్యత లేని ధనబలం, క్షేత్రస్థాయి కార్యకర్తల బలం లేని నాయకత్వం రాజకీయాల్లో రాణించడం కష్టం. కేవలం సొంత ఇమేజ్ కోసమే కులాలను రోడ్డు మీదకు తీసుకురావడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు రివర్స్ అవుతాయి.


