ఏమీ చేయకుండానే ఎలివేషన్లు ఇవ్వడంలో వైసీపీని మించిన వారు ఎవరూ ఉండరు. అసెంబ్లీకి వెళ్తామని మీడియాకు లీకులు ఇచ్చి జగన్ రెడ్డి.. వైసీపీ ఎల్పీ సమావేశాన్ని నిర్వహించారు. జగన్ ఒక్కరు హాజరు కాకుండా మిగతా అందరూ అసెంబ్లీకి వెళ్లేలా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తీరా సమావేశంలో జగన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వద్దని చెప్పేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వనందుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. దీంతో తమను అయినా వెళ్లమంటారని ఆశపడి వచ్చిన ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది.
శాసనమండలి సభ్యులను మాత్రం వెళ్లమని జగన్ చెప్పారు. మీరు మండలిలలో బాగా పోరాడాలని ఓ మాట చెప్పారు. మరి ఎమ్మెల్యేలు వెళ్తే అవకాశం వచ్చినంత వరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తారు కదా అంటే..తాను రాకుండా ఎవరూ వెళ్లకూడదని… అక్కడ ఎవరైనా ప్రజా సమస్యలపై గట్టిగా నిలదీస్తే తనకంటే మంచి పేరు వస్తుందని ఆయన ఫీల్ అవుతారని అందుకే ఎమ్మెల్యేలను కూడా పంపడం లేదని అంటున్నారు. పెద్దిరెడ్డికి ఎమ్మెల్యేల బాధ్యత ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదని చెబుతున్నారు.
ఇంతోటి నిర్ణయం తీసుకోవడానికి సాక్షి మీడియాలోనూ.. అనుకూల మీడియాలోనూ.. వైసీపీ ఎల్పీ సమావేశం లో కీలక నిర్ణయాలు అని హడావుడి చేశారు. తీరా .. సమావేశం ప్రారంభమైన అయిదు నిమిషాలకే ఈ నిర్ణయ తీసుకున్నారు. ఈ సమావేశాల్లో అరవై పని దినాల డెడ్ లైన్ ముగిసిపోతుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
