ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐదేళ్ల పాటు సాగిన ఒక సహాయకుడి ఆర్థిక సామ్రాజ్యం ఇప్పుడు పెను సంచలనాన్ని సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ కె. నాగేశ్వరరెడ్డి అలియాస్ కేఎన్ఆర్ చుట్టూ ఇప్పుడు మద్యం కుంభకోణం సిట్ దర్యాప్తు ఉచ్చు బిగుస్తోంది. ఒకప్పుడు కేవలం రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వేతనంతో సాధారణ జీవితం గడిపిన వ్యక్తి, ఐదేళ్లలోనే మూడు రాష్ట్రాల్లో వందల కోట్ల విలువైన ఆస్తులు, లగ్జరీ కార్ల షోరూమ్‌లలో వాటాలు, బినామీ కంపెనీలు ఎలా సృష్టించగలిగారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే, సామాన్య జనం ఆలోచిస్తున్న అసలు లాజిక్ ఏంటంటే.. ఒక ముఖ్యమంత్రి పీఏ స్థాయి వ్యక్తి, అధినేతకు తెలియకుండా ఇంతటి భారీ సెటిల్మెంట్లు చేయడం సాధ్యమేనా?
జగన్‌కు ఫోన్ లేదు.. కెఎన్ఆర్ ఫోనే జగన్ ఫోన్
రాజకీయ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రి పీఏ అంటే.. ఆయన చేసే ప్రతీ పని, ప్రతీ ఫోన్ కాల్, ప్రతీ సెటిల్మెంట్ వెనుక సీఎం ఆమోదం లేదా వారి పేరో ఉంటుందనేది బహిరంగ రహస్యం. జగన్ మోహన్ రెడ్డి పాలనా శైలిని గమనించిన వారికి ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆయన దగ్గర సొంతంగా మొబైల్ ఫోన్ ఉండదు. తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చే ఫోన్ కాల్స్, అధికారుల బదిలీలు, మైనింగ్, లిక్కర్ డీలింగ్స్ అన్నీ కేఎన్ఆర్ ఫోన్ ద్వారానే, ఆయన పర్యవేక్షణలోనే సాగాయి. ఐదేళ్ల పాటు లిక్కర్ సిండికేట్లకు, ప్రభుత్వ పెద్దలకు మధ్య కేఎన్ఆర్ ఒక బలమైన వారధిగా వ్యవహరించారని సిట్ అధికారులు గుర్తించారు. అంటే, ఇక్కడ సీఎం పేరును వాడుకుని కేఎన్ఆర్ సంపాదించారా? లేక జగన్ రెడ్డే తన నమ్మకస్తుడైన పీఏను ఒక ‘బినామీ’గా ముందు పెట్టి తెరవెనుక ఈ వందల కోట్ల దందాను నడిపించారా? అన్నది సులువుగా అర్థం చేసుకోవచ్చు.
టిక్కెట్లు ఇస్తామని కోట్లు తీసుకుంటే జగన్‌కు తెలియదా?
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఎన్నికల టిక్కెట్ల కేటాయింపు కోసం ఆశావహుల నుంచి, అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి నెగిటివ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయంటూ బెదిరించి కేఎన్ఆర్ కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో కొందరు బాధితులు స్వయంగా జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదులు చేసినప్పటికీ ఆయన ఆ పీఏపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, పైగా మరింత ప్రాధాన్యతనిచ్చారు. ఫిర్యాదులు వచ్చినా అధినేత పట్టించుకోకపోవడం వెనుక ఉన్న అసలు మతలబు ఏంటో ఇట్టే అర్థమైపోతుంది. ఈ వసూళ్ల వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? అనే లాజిక్‌ను సిట్ అధికారులు ఇప్పుడు ఛేదించాల్సి ఉంది.
సెటిల్మెంట్లతో వందల కోట్లు.. అందరూ కలిసి ఎన్ని చేశారో?
కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంకు ఖాతాలోకి 2019-24 మధ్య ఏకంగా రూ. 19.85 కోట్ల నగదు జమ కావడం, భోగాపురం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో వందల ఎకరాల భూములు ఉండటం ప్రాథమికంగానే నిరూపితమైంది. ఈ ఆస్తులన్నీ కేవలం ఒక పీఏ స్థాయి వ్యక్తి చేసిన ఫ్రీలాన్స్ సంపాదన అని ఎవరూ నమ్మలేరు.లిక్కర్ గ్యాంగ్‌తో జగన్ రెడ్డికి ఎప్పటికప్పుడు తాడేపల్లిలో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసింది కూడా కేఎన్ఆరేనని ఆధారాలు లభించాయి. దీన్ని బట్టి చూస్తే, ఈ వందల కోట్ల అక్రమాస్తులు కేఎన్ఆర్ సొంతంగా వెనకేసుకున్నవి కావు; ఆయన కేవలం ఒక ‘ఫ్రంట్ ఫేస్’ మాత్రమేనని, అసలు లబ్ధిదారుడు తాడేపల్లి ప్యాలెస్‌లోనే ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
ఈ కేసు పీఏ అవినీతి మాత్రమే కాదు!
ఈ కేసు కేవలం ఒక పీఏ అవినీతికి సంబంధించినది కాదు.. ఇది వ్యవస్థీకృత ప్రభుత్వ దోపిడీకి సంబంధించిన పెద్ద స్కామ్. విచారణ అధికారులు కేఎన్ఆర్ భార్య, ఆయన బావమరిది పేరిట ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు, బినామీగా ఉన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకరరెడ్డి ఆస్తుల మూలాలను వెలికితీస్తే.. ఈ లిక్కర్, ల్యాండ్ సెటిల్మెంట్ల వెనుక ఉన్న అసలు ‘బాస్’ ఎవరో అధికారికంగా తేలిపోతుంది. కేఎన్ఆర్ ను కేవలం ఒక నిందితుడిగా కాకుండా, ఈ కోణంలో విచారణ జరిపితేనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక నేరాల గుట్టు పూర్తిగా బయటపడుతుంది


