ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 ను ప్రవేశపెట్టబోతున్న తరుణంలో, ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిదే కాకుండా, రాజకీయంగా పుంజుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఈ కీలక తరుణంలో జగన్ మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయం ఏపీ రాజకీయ గమనాన్ని మార్చడమే కాకుండా, ప్రాంతీయ సెంటిమెంట్లతో తన పార్టీకి ఊపిరి పోసుకోగలరు.
కేసీఆర్ తరహా పోరాటం చేయాలి!
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, సెంటిమెంట్‌ను పీక్స్‌కు తీసుకెళ్లినట్లుగా.. ఇప్పుడు జగన్ కూడా తనకున్న 11 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలతో రాజీనామా చేయించి డైరెక్ట్ ఫైట్ కు దిగితే సీన్ మొత్తం మారుతుంది. అమరావతి ఏకైక రాజధాని అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది అనే వాదనను బలంగా వినిపిస్తూ, మూడు రాజధానుల కోసం రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్తే.. అది వైసీపీకి ఒక నైతిక బలాన్ని ఇస్తుంది. ఒకవేళ ఆయా ప్రాంతాల్లో ప్రజలు వైసీపీకి పట్టం కడితే, అది కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.
విశాఖ సెంటిమెంట్ – వైసీపీ నిజాయితీ
వైసీపీ ఇప్పటికీ తాము అమరావతికు వ్యతిరేకం కాదని, కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నామని చెబుతోంది. పార్లమెంట్లో ఈ బిల్లును వ్యతిరేకించి, విశాఖే పరిపాలనా రాజధానిగా ఉండాలని పట్టుబట్టడం ద్వారా ఉత్తరాంధ్రలో పడిపోయిన తన పట్టును వైసీపీ తిరిగి సాధించుకోవచ్చు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని సజ్జల వంటి నేతలు చేస్తున్న పొడి పొడి మాటల కంటే, మాది మూడు రాజధానుల విధానమే అని కుండబద్దలు కొట్టి చెబితే పార్టీ విశ్వసనీయత పెరుగుతుంది. అస్పష్టమైన వైఖరి వల్ల అటు అమరావతి రైతులకు, ఇటు విశాఖ ప్రజలకు ఇద్దరికీ వైసీపీ దూరమయ్యే ప్రమాదం ఉంది.
జగన్ డేరింగ్ అడుగు వేస్తారా?
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. జగన్ ఈ స్థాయి రిస్క్ తీసుకోగలరా? పార్లమెంట్లో కేంద్రంతో నేరుగా ఢీకొంటే ఎదురయ్యే రాజకీయ, వ్యక్తిగత పరిణామాలను ఆయన తట్టుకోగలరా? ప్రస్తుతం వైసీపీ నాయకత్వం కేవలం అసెంబ్లీని బహిష్కరించడం వంటి పరోక్ష పద్ధతులకే పరిమితమైంది. కానీ, ప్రజల్లో మైలేజ్ రావాలంటే ప్రాంతీయ సెంటిమెంట్ ను ఆయుధంగా మార్చుకుని క్షేత్రస్థాయిలోకి వెళ్లాలి. అమరావతి బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ ప్రజా ప్రతినిధులంతా రాజీనామా చేసి రోడ్డెక్కితే.. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ ఉద్యమం పుట్టుకొచ్చే అవకాశం ఉంది.
వైసీపీకి ఇప్పుడు పోయేదేమీ లేదు, పొందేందుకే చాలా ఉంది. ఒకవేళ రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగిస్తే అది పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ అవుతుంది. లేనిపక్షంలో, పార్లమెంట్లో కేవలం ప్రసంగాలు చేసి మౌనంగా ఉండిపోతే.. అటు కూటమి వేగాన్ని ఆపలేరు, ఇటు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోలేరు. మరి జగన్ ఆ డేరింగ్ స్టెప్ వేసి ఏపీ రాజకీయాల్లో మళ్లీ కింగ్ మేకర్ అవుతారో లేదో చూడాలి.
