వైసీపీ క్యాడర్‌కు కష్టమొస్తే నేనున్నా అని జగన్ రెడ్డి ముందుకు రావాలి. అలా వస్తానని వారికి నమ్మకం కలిగించాలి. అప్పుడు మాత్రమే వారు జగనన్నా ..కష్టం వచ్చిందన్నా అని ఆయనను అడుగుతారు. కానీ ఆయనను అడిగినా ప్రయోజనం ఉండదు.. పట్టించుకునేవారు ఉండరు అనుకున్నప్పుడు ఆ పార్టీ క్యాడర్ కూడా సాయం చేసేవారిని అడుగుతారు. అప్పుడు పోయేది జగన్ రెడ్డి పరువే. ఇప్పుడు అదే జరుగుతోంది. వైసీపీ క్యాడర్ అంతా కష్టం వస్తే నారా లోకేష్ పేరు జపిస్తున్నారు. అన్నా.. ప్లీజ్ హెల్ప్ అని అభ్యర్థిస్తున్నారు. జగన్ రెడ్డి తన కోసం పని చేస్తున్న క్యాడర్లో ఆ నమ్మకాన్ని సాధించలేకపోయారు. కానీ తనను ఘోరంగా ట్రోల్ చేశారని తెలిసినా.. వారి కష్టాల్లో మాత్రం తన బాధ్యతను నారా లోకేష్ నిర్వర్తిస్తున్నారు. తాను పార్టీలు చూడనని నిరూపిస్తున్నారు.
క్యాడర్ సాయం అడిగినా చేయని లీడర్ జగన్
జగన్ రెడ్డి క్యాడర్ ను ఆదుకోవడం అంటే డబ్బులు దండగ అనుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత ఎక్కువగా క్యాడర్ ను కాపాడుకోవాలి. తాను బెంగళూరులో కాళ్లు చాపుకుని కూర్చుంటే ఆయన కోసం రోడ్డెక్కే క్యాడర్ కు ఏమైనా జరిగితే పట్టించుకునే దిక్కు లేదు. చిన్న సాయమన్నా చేయి జగనన్నా అని అడిగి అడిగి వేసారిపోయారు. ఆయనను అడగడం కూడా దండగ అని ఫిక్సయిపోయారు. ఒక్కరూ జగనన్నా సాయం చేయండి అని అడగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడే ఆయన పట్టించుకోలేదు. తన కోసం పని చేసి.. శ్యామ్ కలకడ అనే కార్యకర్త అనారోగ్యం పాలైతే..చికిత్స కాదు కదా చచ్చిపోయాక పలకరించే దిక్కు కూడా లేకపోయింది. ఇప్పుడు అందరి పరిస్థితి అదే.
నారా లోకేష్ ను సాయం అడుగుతున్న వైసీపీ కార్యకర్తలు – జగన్ తల ఎక్కడ పెట్టుకుంటారు ?
తన పార్టీ కార్యకర్తలు తనను కాకుండా నారా లోకేష్ ను సాయం అడుగుతున్నారంటే.. ఇక జగన్ తల ఎక్కడ పెట్టుకోవాలి. తన కోసం పని చేస్తున్న వారి నమ్మకాన్ని కూడా తాను పొందలేకపోయానని ఆయన తలదించుకోవాలి. ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పాలి. తన కోసం పని చేస్తున్న వారికి చిరు సాయంచేయకపోతే ఆ రాజకీయ నాయకత్వం ఎందుకు?. ఇటీవల ఓ వైసీపీ కార్యకర్త పోస్టు పెట్టగానే సాయం చేశారని ఆ కార్యకర్తను కోవర్ట్ అని ముద్ర వేశారు. మహిళా కమిషన్ సభ్యురాలు గడ్డం ఉమ కూడా లోకేష్ ను సాయం అడిగారు. ఇంకా చాలా మంది అడిగి చేయించుకున్నారు. వారందరిపై అలాంటి ముద్ర వేస్తారా ?. అలా వేయాలంటే.. వైసీపీలో కార్యకర్తలు ఉండరు.. లోకేష్ ఫ్యాన్సే ఉంటారు.
రాజకీయం అంటే లోకేష్ చేసేదే !
రాజకీయం .. రాజకీయంగానే ఉండాలి. వ్యక్తిగత శత్రుత్వం ఉండకూడదు. జగన్ రెడ్డికి కామన్ సెన్స్ ఉండదు. రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులుగా చూడటమే కాదు తన పార్టీలో అందరూ అలాగే ఉండాలనుకుంటారు. తిట్లతో … వ్యక్తిగత శత్రువులుగా చేసి చోద్యం చూస్తాడు కూడా. కానీ కష్టం వస్తే పట్టించుకోరు. మిథున్ రెడ్డి జైల్లో ఉంటే పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ నారా లోకేష్ అలా కాదు.. ఇతర పార్టీలకు చెందిన వారు అయినా కష్టం వస్తే మాత్రం సాయం చేస్తున్నారు. తనను ఘోరంగా తిట్టారని ఆయన మనసులో పెట్టుకోవడం లేదు. అది నారా లోకేష్ రాజకీయం. రాజకీయం అంటే అలాగే ఉండాలి. జగన్ రెడ్డి ఎప్పటికీ అందుకోలేని రాజకీయం నారా లోకేష్ చేస్తున్నారు.