రివ్యూ: జై సింహా

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

అగ్ర క‌థానాయ‌కుడితో సినిమా అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. ఏం చెప్పాల‌న్నా ‘హీరోయిజం’ మిస్ అవ్వ‌కూడ‌దు. అభిమానులు పెట్టుకున్న ఆశ‌లు వ‌మ్ము కాకూడ‌దు. అలాగ‌ని ఆ ప్ర‌యాణంలో క‌థ దెబ్బ‌తిన‌కూడ‌దు. ఏం చెప్పినా, ఎంత చెప్పినా మ‌ళ్లీ ఫ్యాన్స్ కి కావ‌ల్సిన దినుసుల ద‌గ్గ‌ర‌కు రావాల్సిందే. బాల‌కృష్ణ‌లాంటి మాస్ హీరోతో సినిమా అన్న‌ప్పుడు త‌ప్ప‌కుండా ఈ సూత్రాన్ని పాటించి తీరాల్సిందే. ‘జై సింహా’కి అచ్చంగా ఇదే జ‌రిగింది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే బాల‌య్య లేని జై సింహా… ఉప్పు లేని ప‌ప్పు కూర‌. బాల‌య్య త‌ర‌హా డైలాగులు, డాన్సులు, హీరోయిజం జ‌త చేశాక‌… అదో బిరియానీలా త‌యారైంది. అదెలాగంటే…

క‌థ‌ :

న‌ర‌సింహ (బాల‌కృష్ణ‌)కు త‌న బాబు అంటే ప్రాణం. త‌న కోస‌మే.. విశాఖ‌ప‌ట్నం వ‌దిలేసి – త‌మిళ‌నాడులోని కుంభ‌కోణం వ‌చ్చేస్తాడు. డ్రైవ‌ర్‌గా పనిచేస్తుంటాడు. బాబుని వెదుక్కుంటూ గౌరి (న‌య‌న‌తార‌) కూడా కుంభ‌కోణం వ‌స్తుంది. ఆ సంగ‌తి తెలుసుకుని… అక్క‌డి నుంచి మ‌రో చోటికి వెళ్లే ప్ర‌య‌త్నంలో గౌరికి ఎదురుప‌డ‌తాడు న‌ర‌సింహా. అప్పుడు ఏం జ‌రిగింది? గౌరి, న‌ర‌సింహా ఎందుకు దాగుడు మూత‌లు ఆడుకుంటున్నారు? దానికి ముందు, ఆ త‌ర‌వాత జ‌రిగే క‌థేంటి? అనేదే `జై సింహా` సినిమా.

విశ్లేష‌ణ‌ :

క‌థ‌ని ఇంత సింపుల్‌గా చెప్పేస్తే అది బాల‌కృష్ణ సినిమా ఎలా అవుతుంది? దానికి త‌గ్గ దినుసుల్ని జోడించుకుంటూ వ‌చ్చాడు కె.ఎస్‌.ర‌వికుమార్‌. బాల‌య్య సినిమాల్లో క‌నిపించే బీభ‌త్స‌మైన ఎంట్రీ ఈ సినిమాలో ఉండ‌దు. ఓ అజ్ఞాత‌వాసిలా, ఆయుధం వ‌దిలేసిన యుద్ధ వీరుడిలా అత‌ని ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. కుంభ‌కోణం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాల‌తో క‌థ‌.. మెల్ల‌మెల్ల‌గా అస‌లు క‌థ‌లోకి వెళ్తుంటుంది. ముర‌ళీ మోహ‌న్ ఇంట్లో బ్ర‌హ్మానందం అండ్ కోతో సాగిన కామెడీ న‌వ్వించ‌దు. అలాగ‌ని వెగ‌టూ పుట్టించ‌దు. క‌మీష‌న‌ర్‌తో బాల‌య్య గొడ‌వ ప‌డ‌డం, వార్నింగ్ ఇవ్వ‌డం, బ్రాహ్మ‌ణుల వైశిష్టం గురించి చెప్ప‌డం ఇవ‌న్నీ – అభిమానుల్ని అల‌రించ‌డానికి ద‌ర్శ‌కుడు ఎంచుకున్న స‌న్నివేశాలు. దానికీ అస‌లు క‌థ‌కూ సంబంధం ఉండ‌దు. కాక‌పోతే తొలి స‌గంలో బాల‌య్య పాత్ర‌ని ఎలివేట్ చేయ‌డానికి ద‌ర్శ‌కుడికి అంత‌కంటే మార్గం దొర‌కలేదు. మ‌ధ్య‌లో క‌థానాయిక న‌టాషా ఓ డ్రీమ్ సాంగ్ వేసుకుంటుంది. అక్క‌డ మాత్రం ఫ్యాన్స్ కి పండ‌గ‌. మ‌రీ పాతికేళ్ల కుర్రాడైపోయిన బాల‌య్య‌… న‌టాషాతో న‌షాళం ఎక్కించేలా స్టెప్పులు వేస్తాడు. కాక‌పోతే అప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య పాత్ర సాగిన విధానానికీ, ఆ పాట‌లోని స్టెప్పుల‌కీ మాత్రం పొంత‌న కుద‌ర‌దు అంతే. క‌థానాయిక `డ్రీమ్` సాంగ్ కాబ‌ట్టి చెల్లుబాటు అయిపోవొచ్చు.

ప్రేక్ష‌కులు, అభిమానులు ఆశించే ట్విస్ట్ స‌రిగ్గా ఇంట్ర‌వెల్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. అది కాస్త కొత్త‌గానే అనిపిస్తుంది. నిజానికి ఈ సినిమాలో కొత్త‌గా అనిపించే అంశం ఏమైనా ఉందీ అంటే అది బాబుకి సంబంధించిన ఎపిసోడ్ మాత్ర‌మే. ద్వితీయార్థంలో ష‌రామామూలుగానే ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. అక్క‌డ న‌య‌న‌తారతో ల‌వ్ ఎపిసోడ్‌.. ప్ర‌కాష్‌రాజ్‌తో క్లాష్ ఇవ‌న్నీ బాగానేఉన్నా సుదీర్ఘంగా సాగాయి. ధ‌ర్నా స‌న్నివేశం, అందులో విల‌న్‌తో గొడ‌వ‌కు దిగ‌డం మిన‌హాయిస్తే.. మాస్‌కి ఊపు నిచ్చే అంశాలేం క‌నిపించ‌వు. న‌య‌న‌తార‌తో బాల‌య్య విడిపోవ‌డం కూడా… కాస్త అతికిన‌ట్టే అనిపిస్తుంది. ఇంకా బ‌ల‌మైన ఎమోష‌న్స్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్అంతా త్యాగాలే! బాల‌య్య చేసే త్యాగం కంట‌త‌డి పెట్టించేలా ఉంటే ఈ సినిమాకి మ‌హిళా ప్రేక్ష‌కులు నీరాజ‌నం ప‌ట్టేవారు. ఎలాగూ అభిమానుల‌కు కావ‌ల్సిన అంశాలు ఉన్నాయి కాబ‌ట్టి…. వాళ్లూ ఈ సినిమాని హిట్ చేసే ప‌నిలో ఉండేవారు. `జై సింహా` లోటు ఒక్క‌టే.. అన్నీ ఉన్నాయి. కానీ… అవంత ప్ర‌భావ‌వంతంగా క‌నిపించ‌వు. బాల‌య్య – న‌య‌న ఎపిసోడ్ లో వాళ్ల‌నింకా ప్రేమికులుగా చూపించ‌డం, వాళ్ల‌తో ప్రేమ – త్యాగాల‌కు సంబంధించిన డైలాగులు చెప్పించ‌డం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వ‌య‌సు మీద ప‌డుతున్న క‌థానాయ‌కులు ఇంకా ప్రేమ‌.. ప్రేమ అంటూ డైలాగులు చెప్ప‌డం మానుకుంటే మంచిది.

*న‌టీన‌టుల ప్ర‌తిభ‌ :

న‌ట‌సింహం బాల‌య్య‌… ఈ పేరుకి తగ్గ‌ట్టే సింహావ‌తారం ఎత్తేశాడు. తొలి స‌న్నివేశాల్లో మృదు స్వ‌భావిగా శాంత‌మూర్తిగా క‌నిపించిన బాల‌య్య‌.. త‌న అవ‌స‌రం ప‌డిన‌ప్పుడ‌ల్లా విధ్వంసం సృష్టించాడు. మ‌రీ ముఖ్యంగా అమ్మ‌కుట్టి పాట‌లో అయితే.. స్టెప్పులు అదిరిపోతాయి. బాల‌య్య ఫ్యాన్స్‌కి ఆ పాట ఒక్క‌టీ చాలు. అయితే బాల‌య్య త‌న స్ర్కీన్ ప్రెజెన్స్‌పై దృష్టి పెట్టాలి. ఈ సినిమాలో చాలా లావుగా క‌నిపిస్తున్నాడు. దానికి తోడు బాల‌య్య ఎంచుకునే కాస్ట్యూమ్స్ బాల‌య్య‌ని మ‌రింత బొద్దుగా చూపిస్తున్నాయి. న‌య‌న‌తార‌ది ప్రాధాన్యం ఉన్న పాత్రే. కాక‌పోతే స్ర్కీన్ ప్రెజెన్స్ త‌క్కువ‌. విశ్రాంతికి ముందు రెండే రెండు సీన్ల‌లో క‌నిపిస్తుంది. న‌టాషా గ్లామ‌ర్ కే ప‌రిమిత‌మైంది. హ‌రిప్రియ దీ చిన్న రోలే. చాలా రోజుల త‌ర‌వాత బ్ర‌హ్మానందం పూర్తి స్థాయి హాస్య పాత్ర పోషించాడు. కాక‌పోతే… న‌వ్వించ‌డం మానేసి, విసిగించాడు. చంద్ర‌ముఖిలో వ‌డివేలు పాత్ర గుర్తొచ్చింది. ముర‌ళీమోహ‌న్‌తో పాటు విల‌న్ గ్యాంగ్ కూడా ఓకే అనిపిస్తారు. బాల‌య్య పాత్ర‌ని మిన‌హాయిస్తే… మిగిలిన పాత్ర‌లెవీ ద‌ర్శ‌కుడు స‌రిగా డిజైన్ చేయ‌లేదు.

సాంకేతిక వ‌ర్గం :

చిరంత‌న్ భ‌ట్ అందించిన పాట‌లేం గొప్ప‌గా లేవు. అమ్మ‌కుట్టి మాత్రం మాస్‌కి న‌చ్చుతుంది. యాక్ష‌న్ సీన్స్‌లో తాను అందించిన బీజియ‌మ్స్ బాగున్నాయి. రాంప్ర‌సాద్ కెమెరా వ‌ర్క్‌, రామ్ ల‌క్ష్మ‌ణ్ పోరాటాలూ ఆక‌ట్టుకుంటాయి. ర‌త్నం సంభాష‌ణ‌లు బాగానే వినిపించాయి. ప్ర‌తినాయకుల‌కు హీరో వార్నింగ్ ఇచ్చే సంద‌ర్భంలో ఆయ‌న క‌లం బాగా ప‌నిచేసింది. కె.ఎస్‌.ర‌వికుమార్ ఆలోచ‌న‌లు విభిన్నంగా ఉంటాయి. ఆయ‌న‌కు మాస్ ప‌ల్స్ బాగా తెలుసు. సెంటిమెంట్‌నీ పండిస్తారు. ఆ మూడింటికీ ఈ సినిమాలో స్కోప్ ఉంది. కానీ దేన్నీ స‌రిగా ఎలివేట్ చేయ‌లేక‌.. ఆయ‌న కూడా పూర్తిగా బాల‌య్య హీరోయిజంపైనే ఆధార‌ప‌డిపోయారు.

తీర్పు

బాల‌య్య సినిమాని బాల‌య్య కోస‌మే చూస్తాం అనుకున్న‌వాళ్లు నిర‌భ్యంత‌రంగా ఈ సినిమా చూడొచ్చు. కాక‌పోతే వాళ్లు కూడా సెంటిమెంట్ డోస్‌ని త‌ట్టుకోవాలి. ఓ సాదాసీదా క‌థ‌ని బాల‌య్య త‌న శ‌క్తి మేర నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేశాడు. సంక్రాంతి సింహం… మ‌రోసారి అదే ఫీట్ ని రిపీట్ చేయ‌లేక‌పోవొచ్చు గానీ, ఫ్యాన్స్‌ని మాత్రం నిరాశ ప‌ర‌చ‌దు.

చిరంత‌న్ భ‌ట్ అందించిన పాట‌లేం గొప్ప‌గా లేవు. అమ్మ‌కుట్టి మాత్రం మాస్‌కి న‌చ్చుతుంది. యాక్ష‌న్ సీన్స్‌లో తాను అందించిన బీజియ‌మ్స్ బాగున్నాయి.

ఫైన‌ల్ పంచ్‌: సెంటిమెంట్ సింహం

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

తమ్మినేనికి డిగ్రీ లేదట – అది ఫేక్ డిగ్రీ అని ఒప్పుకున్నారా ?

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం నామినేషన్ వేశారు. అఫిడవిట్ లో తన విద్యార్హత డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. కానీ ఆయన తనకు డిగ్రీ పూర్తయిందని చెప్పి హైదరాబాద్ లో...

గుంతకల్లు రివ్యూ : “బెంజ్‌ మంత్రి”కి సుడి ఎక్కువే !

మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు బెంజ్ మంత్రి అని పేరు పెట్టారు టీడీపీ నేతలు. ఇప్పుడా బెంజ్ మంత్రిని నెత్తికి ఎక్కించుకుని మరీ ఎమ్మెల్యేగా మరోసారి గెలిపించడానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో ఓ...

బ్యాండేజ్ పార్టీ : వైసీపీ డ్రామాలపై జనం జోకులు

వెల్లంపల్లి కంటికి బ్యాండేజ్ వేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయంలో పక్కనున్న జనం నవ్వుతున్నారని కూడా ఆయన సిగ్గుపడటం లేదు. కంటికి పెద్ద ఆపరేషన్ జరిగినా రెండు రోజుల్లో బ్యాండేజ్ తీసేస్తారు నల్లకళ్లజోడు పెట్టుకోమంటారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close