తమిళనాడు ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిల ప్రభావం ఏ మాత్రం తగ్గలేదు. అన్నాడీఎంకే, డీఎంకే రెండు పార్టీలు వీరిని ఇప్పటికీ ప్రధానంగా ప్రచారంలో ఉపయోగించుకుంటున్నారు. ఇందుకు డిజిటల్ టెక్నాలజీని వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతోంది. చనిపోయిన దిగ్గజ నేతలు జయలలిత , కరుణానిధి గొంతులను ఏఐ సాంకేతికతతో ఆడియోలుగా తయారు చేసిన రాజకీయ పార్టీలు, వాటిని ప్రచారానికి అస్త్రాలుగా వాడుకుంటున్నాయి. కేవలం సభల్లో వారి వీడియోలు ప్రదర్శించడమే కాకుండా, నేరుగా ఓటర్ల మొబైల్ ఫోన్లకే వారి గొంతులతో కాల్స్ వెళ్లేలా చేస్తున్నారు.
గ్రామీణ ఓటర్ల ఆశ్చర్యం.. ఆనందం
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు, పాత తరం కార్యకర్తలు తమ అభిమాన నాయకుల గొంతులను ఫోన్లో వినగానే అవాక్కవుతున్నారు. వణక్కం.. .. నేను జయలలితను మాట్లాడుతున్నాను అంటూ ఫోన్లో వినిపిస్తుంటే, అది రికార్డింగ్ అని తెలిసినా సరే.. ఒక రకమైన భావోద్వేగానికి లోనవుతున్నారు. తమ ప్రియతమ నేతలు మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతున్నట్లుగా ఫీలవుతూ, ఏఐ కాల్స్ విన్న తర్వాత కొందరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
డీప్ ఫేక్ వర్సెస్ డిజిటల్ లెగసీ
ఈ ఏఐ ప్రచారం వెనుక భారీ వ్యూహమే ఉంది. అధికార డీఎంకే కరుణానిధి గొంతుతో ప్రభుత్వ పథకాలను వివరిస్తుంటే, ఏఐఏడీఎంకే జయలలిత గొంతుతో పార్టీ ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది. అయితే, దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. చనిపోయిన వారిని రాజకీయాల కోసం ఇలా డిజిటల్ ఘోస్ట్లుగా మార్చడం ఎంతవరకు సమంజసమని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. ఇది ఓటర్లను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, టెక్నాలజీని దుర్వినియోగం చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
టెక్నాలజీతో వారసత్వ రాజకీయం
ఈ ఏఐ ప్రయోగం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.. పాత తరం ఓట్లను పదిలం చేసుకోవడమే. కొత్తగా వచ్చిన నేతలు తమ పూర్వీకుల అడుగుజాడల్లోనే నడుస్తున్నారని నిరూపించుకోవడానికి ఈ డిజిటల్ వారసత్వాన్ని వాడుకుంటున్నారు. గ్లామర్, టెక్నాలజీ రెండూ కలిసిన ఈ కొత్త తరహా ప్రచారం తమిళనాడు ఎన్నికలను దేశంలోనే అత్యంత ఖరీదైన , హైటెక్ ఎన్నికలుగా మార్చేసింది.
