ప్రముఖ కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి, ఆయన సంస్థ మేఘా ఇంజనీరింగ్ అక్రమాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. సంస్థలో 51 శాతం వాటాను దక్కించుకోవడానికి కృష్ణారెడ్డి తన పెదనాన్న పి.పి. రెడ్డి, ఆయన అల్లుడి సంతకాలను ఫోర్జరీ చేశారని పాల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి సిద్ధమవడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో కృష్ణారెడ్డి 1.6 బిలియన్ డాలర్ల మధ్యవర్తిత్వ ఒప్పందంపై సంతకం చేశారని, ఈ ఏడాది మే నెలలోపు ఒక బిలియన్ డాలర్ల రెండో విడత సొమ్ము చెల్లించకుంటే ఆయన కంపెనీపై పట్టు కోల్పోవడం ఖాయమని పాల్ సోషల్ మీడియాలో తెలిపారు.
మేఘా కృష్ణారెడ్డి కోరిన 1.1 బిలియన్ డాలర్ల రుణ వినతిని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ ఓక్ట్రీ క్యాపిటల్ తిరస్కరించిందని కేఏ పాల్ తెలిపారు. గతంలో తీసుకున్న రూ. 1,500 కోట్ల నిధులను భారతీయ SPVల నుండి విదేశీ సంస్థలకు మళ్లించి, తిరిగి అవే నిధులను రుణంగా చూపించారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. MEIL సంస్థలో జరుగుతున్న ఇటువంటి అనుమానాస్పద లావాదేవీల వల్లే విదేశీ సంస్థలు పెట్టుబడులకు వెనకాడుతున్నాయని, దీనిపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి దేశ ప్రతిష్టను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయంగా కూడా మేఘా కృష్ణారెడ్డి ఒంటరి అవుతున్నారని పాల్ వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఆయనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, దీంతో ఆయన రిటైర్డ్ అధికారులైన ఎం.జి.వి.కె. భాను , వి.వి. లక్ష్మీనారాయణ వంటి వారి ద్వారా దర్యాప్తు సంస్థల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకకే పరిమితమైన MEIL, త్వరలోనే తిరిగి పి.పి. రెడ్డి చేతుల్లోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన విశ్లేషించారు.
ప్రస్తుతం కష్టాల్లో ఉన్న మేఘా కృష్ణారెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో వివాదాస్పద భూముల సెటిల్మెంట్ల ద్వారా గట్టెక్కాలని చూస్తున్నారని పాల్ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండతో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తానే నేరుగా ప్రజల పక్షాన పోరాటం చేస్తానని కేఏ పాల్ హెచ్చరించారు.
