బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనర్హతా పిటిషన్ పై విచారణకు హాజరైన తర్వాత కడియం కేసీఆర్ పై తనకు ఉన్న కోపాన్ని మొత్తం వెళ్లగక్కారు. కేసీఆర్ తెలంగాణకు ఎలా జాతిపిత అవుతారని.. అలా చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. కమిషన్ల కోసమే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి.. తెలంగాణను దివాలా తీయించారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం రకరకాల స్కాములలో ఇరుక్కుపోయిందన్నారు.
కుటుంబం అంతా వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని… 2014 కంటే ముందు ఉన్న ఆస్తులు, ఇప్పుడు ఉన్న ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచాలని కడియం సవాల్ చేశారు. ప్రజా సమస్యలపై స్పందించని వ్యక్తి జాతిపిత ఎలా అవుతారని సెటైర్ వేశారు. అధికారం పోయినా కేసీఆర్‌లో అహంకారం తగ్గలేదని, మాట తీరు మారలేదన్నారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించారని ..ప్రజల్లోకి వచ్చి వారి కష్టాలను పట్టించుకోకుండా, ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకుడు ప్రజా నాయకుడు కాలేడన్నారు.
తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకోవడంపైనా కడియం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని ప్రశ్నించారు. రాజకీయం చేస్తారని కడియం శ్రీహరి ప్రశ్నించారు. తెలంగాణ అంటే మీ అయ్యా సొత్తా అని ఘాటుగా ప్రశ్నించి.. బీఆర్ఎస్ నేతలకు షాకిచ్చారు. కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడితే అది తెలంగాణను అవమానించినట్టు ఎలా అవుతుందని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు.
కడియం ఇంత ఘాటుగా మాట్లాడతారని ఊహించని బీఆర్ఎస్ నేతలు ఆయనపై ఎదురుదాడికి దిగారు. అయితే కడియంపై ఎన్ని విమర్శలు చేసినా.. కడియం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు మాత్రం.. సంచలనంగా మారుతున్నాయి.
