మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలంగా పరారీలో ఉన్న ఆయన కేరళలో ఉన్నట్లుగా సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలతో వెళ్లి అరెస్టు చేశారు. కాకాణికి పోలీసులు అన్ని న్యాయపరమైన అవకాశాలు కల్పించారు. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ కాకాణి వెళ్లారు. ఆయనకు ఎక్కడా ఊరట లభించలేదు. చివరికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించిన తర్వాత కూడా ఆయన లొంగిపోలేదు.
అక్రమ మైనింగ్ చేసి వందల కోట్ల క్వార్ట్జ్ ను కొల్లగొట్టడమే కాకుండా అనుమతి లేకుండా పేలుడు పదార్థాలను ఉపయోగించిన కేసులోనూ ఆయన ఉన్నారు. ఇతర కేసులు ఉన్నాయి. కేసులు నమోదైనప్పుడు తాను నెల్లూరు దాటిపోనని..దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చని సవాల్ చేశారు. తీరా అరెస్టు చేస్తారన్న సమాచారం రాగానే పారిపోయారు. పోలీసులు నాలుగైదు సార్లు నోటీసులు ఇచ్చినా రాలేదు. కోర్టుల్లో రిలీఫ్ దొరికితే వద్దామనుకున్నారు. కానీ దొరకలేదు.
సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో ఆయన లొంగిపోతారని అనుకున్నారు. పోలీసులు ఆచూకీ తెలుసుకుని వచ్చేదాకా ఆజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ కారణంగా ఆయనకు బెయిల్ రావడం కూడా ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి.