రివ్యూ : ఈ నాటి యూత్ కి అవసరమే ఈ ‘కళ్యాణ వైభోగమే’

ఊహలు గుస గుస లాడే చిత్రం తో హీరో గా పరిచయం అయిన నాగ సౌర్య ఆ తరువాత ప్లాపుల పర్వం లో వున్నా, తాజాగా ‘అలా మొదలైంది’తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ నందిని రెడ్డి జబర్దస్త్ వంటి ప్లాప్ ఇచ్చిన తరువాత, శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె యల్ దామోదర్ ప్రసాద్ నిర్మాత గా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘కళ్యాణ వైభోగమే’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? అసలు పెళ్ళంటే ఇష్టం లేని ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకోవడం అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకురాలు నందిని రెడ్డి మరో సారి సక్సెస్ అయ్యిందా? హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ సౌర్య కు ఈ చిత్రం అయిన ప్లస్ అయ్యిందా? ‘కళ్యాణ వైభోగమే’పై ట్రైలర్, ఆడియో రిలీజ్ అయినప్పట్నుంచే మంచి క్రేజ్‌ వున్నా .. . మరి ఆ క్రేజ్‌కు తగ్గట్టుగానే సినిమా ఉందా? సమీక్షా లో చూద్దాం..

కథ :

గేమింగ్ సాఫ్ట్‌వేర్ డెవలప్ మెంట్ ప్రొఫెషన్‌లో పనిచేసే శౌర్య (నాగ శౌర్య)కి మొదట్నుంచీ పెళ్ళంటే ఏమాత్రం ఆసక్తి ఉండదు. పెళ్ళి అనే బంధంలో చిక్కుకోవద్దనే సిద్ధాంతాన్ని పెట్టుకొని బతుకుతూంటాడు. షెం అలాంటి ఆలోచనలనే నింపుకున్న దివ్య (మాళవిక నాయర్) కూడా పెళ్ళి అనే బంధంలో పడేందుకు ఒప్పుకోదు. విచిత్రంగా వీరిద్దరికి ఇరు కుటుంబాలూ పెళ్ళి ఫిక్స్ చేస్తాయి. వాళ్లకు పెళ్ళంటేనే ఇష్టం లేదు కాబట్టి ఇద్దరు ఒక అవగాహనకు వచ్చి, ఒకరి మీద ఒకరు లేని పోనీ వి చెప్పి పెళ్లి కాన్సిల్ చేసుకుంటారు. అయినా సరే వీళ్ళు తప్పని పరిస్తితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో పెళ్ళి అంటేనే ఇష్టం లేని వీరిద్దరూ ఏం చేశారు? పెళ్ళిని తప్పించుకోవడానికి ఏం ప్లాన్ చేశారు? తర్వాత వీరిద్దరి ప్రయాణం ఎటువైపు దారితీసింది? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

పెళ్ళంటే ఇష్టపడని, లైఫ్ ని జాలీ గా ఎంజాయ్ చేసే యువకుడిగా హీరో నాగ శౌర్య ఎప్పట్లానే తనదైన యాక్టింగ్‌తో బాగా మెప్పించాడు. లుక్స్ పరంగానూ నాగ శౌర్య సినిమాకు మంచి ఫీల్ తెచ్చాడు. కామెడి సీన్స్, ఎమోషనల్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్, చేయడం లో నాగ సౌర్య సక్సెస్ అయ్యాడనే చెప్పొచు. ఇక మాళవిక నాయర్ కూడా చాలా బాగా నటించింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో మాళవిక నాయర్ తన నటన తో కట్టి పడేసింది. అన్ని విదాల హావభావాలు ప్రదర్శించడంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. చాలాకాలం తర్వాత తెరపై కనిపించిన రాశి, ఓ మంచి పాత్రలో మెప్పించారు. హీరో తండ్రి గా నటించిన దర్శకుడు రాజ్ మాది రాజ్ తన కారెక్టర్ లో ఒదిగి పోయాడు. హీరో ఇన్ తండ్రి గా చేసిన ఆనంద్ పరవ లేదు. ప్రగతి , తాగుబోతు రమేష్ తనదైన స్టైల్లో యాక్ట్ చేసారు హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది.

సాంకేతిక వర్గం:

దర్శకురాలి విషయానికి వస్తే, సినిమాను పూర్తి స్థాయి ఎమోషనల్ డ్రామాగా, క్లీన్‌గా తెరకెక్కించడంలో నందిని రెడ్డి అద్భుతమైన ప్రతిభ చూపారు. చెప్పాలనుకున్న కథను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మంచి నెరేషన్‌తో, జెన్యూన్‌గా నవ్వించే కామెడీతో, ఈ స్క్రీన్‌ప్లేను రూపొందించిన విధానం కట్టిపడేస్తుంది. ఇక నందిని రెడ్డి నెరేషన్‌కు లక్ష్మీ భూపాల్ అందించిన మాటలు కూడా తోడ్పడి సినిమాకు మరింత అందం వచ్చింది. ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి మ్యూజిక్‌ను హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఆయన అందించిన పాటలన్నీ వినడానికి బాగుంటే, విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు అందంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక సినిమాటోగ్రాఫర్ జి వి యస్ రాజు సినిమా కు బాగా ప్లస్ అయ్యారు. సినిమా మూడ్‌ను సరిగ్గా పట్టుకుంటూనే, ప్రతీ ఫ్రేం అందంగా ఉండేలా చూడడంలో సినిమాటోగ్రాఫర్ చూపిన ప్రతిభను మెచ్చుకోవాలి. సినిమా కలర్ ఫుల్ గా రిచ్ గా వుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.

విశ్లేషణ :

ఈ చిత్రం లో ఫ్యామిలీ ఎమోషన్‌ను అద్భుతంగా తెరకెక్కించిన విధానం గురించి చెప్పుకోవచ్చు. పెళ్ళి అనే బంధంపై ఈతరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? నేటితరం సమాజం ఈ అంశాన్ని ఎలా చూస్తుందీ? అన్న విషయాన్ని దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన విధానాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇక ఎక్కడా అసభ్యతకు తావివ్వకుండా పెళ్ళి అయిన కొత్త జంట ఆలోచనలను, ఫ్యామిలీ డ్రామాను చెప్పిన విధానం పూర్తి స్థాయి ఫ్యామిలీ సినిమా వస్తే చూడాలనుకునే వారికి బాగా నచ్చే అంశం. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ కి నచ్చే అంశాలతో, సెకండ్ హాఫ్ లో అసలు సినిమా కథ ఏంటో సవివరంగా చెప్పే ప్రయత్నం బాగుంది. ఒక తెలిసిన కథనే బాగా చెప్పినా, ఎక్కువ నిడివి ఉండడం ఈ సినిమా డిస్సా పాయింట్‌గా చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాలు చాలా లెంగ్తీగా ఉన్నట్లు అనిపిస్తాయి. హీరో హీరోయిన్స్ కి పెళ్లి అనేది ఎందుకు ఇష్టం లేదు అనే పాయింట్ లో బలం లేదు. ఎనీ హౌ….సినిమా వ్యాపార పరంగా ఎంత వసూల్ చేస్తుందో గాని మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది..ఓ ఫీల్ గుడ్ మూవీ గా పేరు తెచ్చుకుంటుంది.

తెలుగు360.కామ్ రేటింగ్ 3.25/5
బ్యానర్ : శ్రీ రంజిత్ మూవీస్,
నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్,రాశి, ప్రగతి,ఆనంద్,తాగుబోతు రమేష్, మరియు రాజ్ మాదిరాజ్ తదితరులు….
కెమెరా : జి వి యస్ రాజు,
ఎడిటర్ : జున్యేద్ సిద్దికి,
మాటలు, పాటలు : లక్ష్మి భూపాల్,
సంగీతం : కళ్యాణ్ కోడూరి
నిర్మాత : కె.ఎల్. దామోదర్ ప్రసాద్
రచన – దర్శకత్వం : జి వి నందిని రెడ్డి
విడుదల తేది : 04.03.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com