విశాఖపట్నం నగర శివార్లలోని కాపులుప్పాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సరికొత్త ఐటీ విప్లవానికి కేంద్ర బిందువుగా మారుతోంది. కేవలం కొద్ది కాలంలోనే ఈ ప్రాంతం ఆధునిక ఐటీ పార్కులు, అత్యున్నత స్థాయి కార్యాలయ సముదాయాలు, గ్లోబల్ టెక్ కంపెనీల రాకతో ఒక శక్తివంతమైన ఐటీ కారిడార్‌గా రూపాంతరం చెందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన మరియు భారీ పెట్టుబడులు ఈ ప్రాంత ముఖచిత్రాన్ని పూర్తిగా మారుస్తున్నాయి.
ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు కాపులుప్పాడపై ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నాయి. RMZ గ్రూప్ దాదాపు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఇక్కడ 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో GCC పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. దీనితో పాటు కాగ్నిజెంట్ 8,000 మందికి ఉపాధి కల్పించే భారీ క్యాంపస్‌ను ఇక్కడ నిర్మిస్తోంది. అదానీ గ్రూప్ , గూగుల్ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న ఏఐ హబ్ ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని డేటా హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఐటీ కంపెనీల అవసరాలకు అనుగుణంగా కాపులుప్పాడలో మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ కల్పించేలా VMRDA ఆధ్వర్యంలో రహదారుల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బోయపాలెం-కాపులుప్పాడ లింక్ రోడ్లు, ఆరు వరుసల బీచ్ కారిడార్ ఈ ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకువస్తున్నాయి. ఇక్కడి ఐటీ హిల్స్ చుట్టూ పెరుగుతున్న గృహ సముదాయాలు మరియు కమర్షియల్ స్పేస్‌లు ఉద్యోగులకు మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తున్నాయి.
కాపులుప్పాడ కేవలం సాఫ్ట్వేర్ రంగంకే పరిమితం కాకుండా, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ , క్లౌడ్ కంప్యూటింగ్ రంగాలకు చిరునామాగా మారుతోంది. రానున్న ఐదు నుండి ఆరు ఏళ్లలో ఈ కారిడార్ ద్వారా సుమారు లక్ష మందికి పైగా యువతకు ప్రత్యక్షంగా ,పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ మార్పు విశాఖపట్నం నగరాన్ని దక్షిణ భారతదేశంలోని ఇతర మెట్రో నగరాలకు ధీటుగా నిలబెడుతూ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు బలమైన చోదక శక్తిగా మారనుంది.
