కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో చెప్పి ఒప్పుడు ఒక్కో దెయ్యం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ఆరోపిస్తున్నారు. ఆమె ప్రధాన టార్గెట్ హరీష్ రావు, సంతోష్ రావు. తర్వాత ఎవరు వస్తారో తెలియదు కానీ.. ఇప్పటికి వీరిద్దరిపై కేసీఆర్ అనుమానాలు పెంచేసుకుని వారిద్దరినీ గెంటేయాలన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. వారిద్దరికీ సీఎం రేవంత్ తో లింకులు పెడుతున్నారు. కానీ కేసీఆర్ అంత అమాయకంగా ఉంటారా అని ఆమె ఆరోపణలు చూస్తున్న బీఆర్ఎస్ క్యాడర్ కు సందేహం వస్తోంది.
సంతోష్ రావు కేవలం కేసీఆర్ సహాయకుడు మాత్రమే !
సంతోష్ రావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నేత కాదు, కేసీఆర్కు నీడలా ఉండే వ్యక్తి మాత్రమే. అయితే, కవిత దృష్టిలో సంతోష్ రావు కేవలం సహాయకుడు కాదు, కేసీఆర్ చుట్టూ ఒక అభేద్యమైన కోట ను నిర్మించిన వ్యక్తి. కేసీఆర్కు ఎవరిని కలవనివ్వాలి, ఏ సమాచారం చేరవేయాలి అనే అంశాలను సంతోష్ రావు నియంత్రించారని కవిత బలంగా నమ్ముతున్నారు. గద్దర్ వంటి ప్రజా గాయకులను ప్రగతి భవన్ గేటు వద్దే ఆపేయడం, ఈటల రాజేందర్ వంటి ఉద్యమ నేతలు పార్టీ వీడటం వంటి పరిణామాల వెనుక సంతోష్ రావు నెగటివ్ ఫిల్టరింగ్ ఉందనేది ఆమె ఆరోపణ. కేసీఆర్ను అందరికీ దూరం చేసి, పార్టీని బలహీనపరిచిన మొదటి దయ్యం సంతోష్ రావేనని ఆమె బాహాటంగానే విమర్శిస్తున్నారు. కానీ కేసీఆర్ కు తెలియకుండా ఇలాంటివి జరుగుతాయని ఎవరూ అనుకోరు. ఎందుకంటే కేసీఆర్ ఆషామాషీ రాజకీయనాయకుడు కాదు. తనను తాను కోటరీలో బంధించుకునే నేత అసలు కాదు. రాజకీయాల గురించి ఆయనకు బాగా తెలుసు.
వారి వల్లే తాను దూరమయ్యానని కవిత ఆగ్రహం
కవిత ఆవేదన అంతా తండ్రికి తనను దూరం చేశారనే పాయింట్ చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో పార్టీ తనను ఒంటరిని చేసిందని, దానికి హరీష్ రావు, సంతోష్ రావులే కారణమని ఆమె భావిస్తున్నారు. తప్పుడు సమాచారంతో కేసీఆర్కు తనపై వ్యతిరేకత కలిగించారని, అందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు పరిస్థితి వచ్చిందని ఆమె వాదన. అందుకే వారిపై కేసీఆర్ లో అనుమానాలు పెరిగేలా చూస్తున్నారు. సంతోష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్ఫార్మర్గా మారారని కవిత ఆరోపిస్తున్నారు. సంతోష్ రావు విశ్వసనీయతను దెబ్బతీయడమే ఆమె ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. హరష్ పైనా ఇదే తరహా ఆరోపణలు చేస్తున్నారు.
కవిత చేసే ఆరోపణల్ని కేసీఆర్ నమ్ముతారా?
కవిత పార్టీలో లేకపోవడం, సస్పెన్షన్కు గురికావడం వల్ల ఆమె మాటలకు విలువ లేదనే వాదన ఉన్నప్పటికీ.. ఆమె కేసీఆర్ కుమార్తె కాబట్టి ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని కవిత వర్గీయులు భావిస్తున్నారు. హరీష్ రావు లాంటి ట్రబుల్ షూటర్ మీద, సంతోష్ రావు లాంటి రైట్ హ్యాండ్ మీద ఆమె చేస్తున్న దాడి పార్టీ క్యాడర్ను అయోమయానికి గురిచేస్తోంది. ఒకవేళ కేసీఆర్ ఆమె మాటలను నమ్మకపోయినా, పార్టీలోని ఇతర నేతలు దీనిని ఒక అవకాశంగా తీసుకుంటారు. కవిత లక్ష్యం కూడా అదే . అలా చేస్తే బీఆర్ఎస్ బలహీనపడుతుంది. కానీ కవిత ప్రయత్నాలు ఫలించాలంటే.. ఆమె మాటలు కేసీఆర్ నమ్మినప్పుడే సాధ్యమవుతుంది.
