‘ఉప్పెన’ తో ఓ తరంగంలా ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఆ సినిమాలో తన లుక్స్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. దాంతో పాటు క్యారెక్టర్ పండింది. సినిమా సూపర్ డూపర్ హిట్. దాంతో తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి హీరోయిన్ దొరికిందని సంబర పడ్డారు. దానికి తగ్గట్టే అవకాశాలూ వరుస కట్టాయి. ఎటు విన్నా, కృతి పేరే. కట్ చేస్తే.. ఫ్లాపులు వెంటాడాయి. సినిమా తరవాత సినిమా, సినిమా తరవాత సినిమా. ఒకదాన్ని మించి మరో ఫ్లాపు. ఇలా పరాజయాలు చుట్టుముట్టాయి. దాంతో కొన్నాళ్లుగా కృతి శెట్టి పేరు తలచుకోవడమే మానేశారు దర్శక నిర్మాతలు. అయితే తమిళంలో మాత్రం కాస్త బిజీ. ఇప్పుడు ప్రదీప్ రంగనాథ్ తో చేసిన `లిక్` రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా తన కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్ అవ్వబోతోందని కృతి గట్టిగా నమ్ముతోంది.
ప్రదీప్ రంగనాథ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ ఇలా వరుస హిట్లు కొట్టాడు. తన స్టోరీ సెలక్షన్ పై చిత్రసీమకు ఓ నమ్మకం ఏర్పడిది. తను ఉన్నాడంటే సినిమా హిట్టే అనే భరోసా దొరికింది. ఆ అదృష్టం కృతికీ కలిసి రావాలి. ఈ హిట్టు పడితే కృతికి కాస్త ఉపశమనం దొరికినట్టవుతుంది. కాకపోతే తన చేతిలో సినిమాలకు ఢోకా లేదు. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అనిల్ రావిపూడి చేయబోయే మల్టీస్టారర్ లో ఓ కథానాయికగా ఎంపికైంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కల్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కృతి నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ డబ్బింగ్ సినిమాతో హిట్టు పడితే కృతి ఖాతాలో మరిన్ని సినిమాలు చేరడం ఖాయం.
