హైదరాబాద్‌లో సొంత విల్లా కల నిజం చేసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు పశ్చిమ హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్ ధరలు చుక్కలు చూపిస్తుండవచ్చు. కానీ, నగరం శివార్లలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రూ. 1.2 కోట్ల నుండి రూ. 1.8 కోట్ల మధ్యలో మంచి గేటెడ్ కమ్యూనిటీ డూప్లెక్స్ విల్లాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు , దక్షిణ హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాలు బడ్జెట్ విల్లాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.
ప్రస్తుత మార్కెట్ రీసెర్చ్ ప్రకారం, బీరమ్ గూడ, పటాన్చెరు , అమీన్పూర్ ప్రాంతాల్లో విల్లాల ధరలు సాపేక్షంగా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ 150 గజాల విస్తీర్ణంలో 3BHK డూప్లెక్స్ విల్లాలు రూ. 1.35 కోట్ల నుండి ప్రారంభమవుతున్నాయి. ఐటీ కారిడార్‌కు కనెక్టివిటీ ఉండటం, మెట్రో విస్తరణ వార్తలతో ఈ ప్రాంతం ఇన్వెస్టర్లకు మొదటి ఛాయిస్‌గా ఉంది. అలాగే ఉత్తర హైదరాబాద్‌లోని కీసర, ఈసీఐఎల్ పరిసరాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులలో రూ. 1.3 కోట్లకు విల్లా లైఫ్‌స్టైల్ దొరుకుతోంది.
దక్షిణ హైదరాబాద్ విషయానికి వస్తే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర్లోని తుక్కుగూడ, ఆదిభట్ల , మహేశ్వరం ప్రాంతాలు తక్కువ ధరలో విల్లాలను అందిస్తున్నాయి. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలలో రూ. 1.6 కోట్ల నుండి రూ. 2 కోట్ల బడ్జెట్లో విల్లాలు లభిస్తున్నాయి. టాటా ఏరోస్పేస్ వంటి కంపెనీలు ఇక్కడే ఉండటం వల్ల ఈ ప్రాంతానికి భవిష్యత్తులో మంచి అప్రిసియేషన్ వచ్చే అవకాశం ఉంది.
నగరానికి కొంచెం దూరంగా ఉన్నా సరే ప్రశాంతత కోరుకునే వారు శంకర్పల్లి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కొన్ని విల్లా ప్రాజెక్టులు రూ. 1.2 కోట్ల నుండే డూప్లెక్స్ ఇళ్లను ఆఫర్ చేస్తున్నాయి. అయితే, ధర తక్కువగా ఉన్నప్పుడు ఆ లేఅవుట్‌కు హెచ్ఎండీఏ,రేరా అనుమతులు ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ ధరలో వస్తున్నాయని గ్రామ పంచాయతీ లేఅవుట్లలో పెట్టుబడి పెట్టి చిక్కుల్లో పడొద్దని హెచ్చరిస్తున్నారు.
