ప్రకాష్ రాజ్ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తీవ్ర వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలకు బాయ్ కాట్ నినాదాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఏ మాత్రం ముందుకు రావడంలేదు. కానీ పవన్ కల్యాణ్ వెనుక దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు.
రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలతో పలు చోట్ల ఫిర్యాదులు
కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ రామాయణ పాత్రలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. శ్రీరాముడు, లక్ష్మణులను ఉత్తర భారతం నుండి వచ్చిన వారిగా, వారు పండ్లు దొంగిలించారనే అర్థం వచ్చేలా ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ సంఘాలను, సామాన్య ప్రజలను తీవ్రంగా కలచివేశాయి. దీనిపై ఏప్రిల్ 16న చట్టపరమైన కేసులు నమోదు కావడంతో పాటు, ఆయన నటిస్తున్న సినిమాలను బాయ్‌కాట్ చేయాలనే నినాదాలు సోషల్ మీడియాలో మిన్నంటాయి. ఈ తీవ్రమైన ఒత్తిడి నుండి బయటపడటానికి ఆయన ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుంటున్నారు.
పవన్ కల్యాణ్‌తో డిబేట్ సవాల్
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్రతిపక్షాలు చారిత్రాత్మక అవకాశాన్ని అడ్డుకున్నాయని విమర్శించారు. దీనిని సాకుగా తీసుకున్న ప్రకాష్ రాజ్, నేరుగా పవన్‌ను టార్గెట్ చేస్తూ డిబేట్ కు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. మహిళా బిల్లును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం దక్షిణాది రాష్ట్రాలకు ద్రోహం చేయడమేనంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే, క్షేత్రస్థాయిలో కనీస రాజకీయ బలం లేని ప్రకాష్ రాజ్, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎంను చర్చకు పిలవడం తాను చేసిన రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలపై డైవర్షన్ లో భాగమే. పవన్ కల్యాణ్ వంటి ప్రజాదరణ ఉన్న నేతతో గొడవ పెట్టుకోవడం ద్వారా, మీడియా దృష్టి తన వివాదాస్పద వ్యాఖ్యల నుండి రాజకీయ చర్చ వైపు మళ్లుతుందని ఆయన భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది పక్కాగా ప్లాన్ చేసిన డైవర్షన్ గేమ్.
రాజకీయ పరిపక్వతపై ప్రశ్నలు
గతంలో ఎంపీగా పోటీ చేసినప్పుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన ప్రకాష్ రాజ్, ఇప్పుడు ప్రజాబలంతో గెలిచిన నేతలను ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో విశ్వాసాలను దెబ్బతీసి, ఆపై రాజకీయ రంగు పూసి తప్పించుకోవాలని చూడటం ఆయన నైజం మారింది. పవన్ కల్యాణ్ ఈ సవాల్‌ను స్వీకరించినా లేకపోయినా, ప్రకాష్ రాజ్ మాత్రం తనపై వస్తున్న ‘యాంటీ-హిందూ’ ముద్రను చెరిపేసుకోవడానికి ఈ రాజకీయ డ్రామాను రక్తికట్టిస్తున్నారన్నది బహిరంగ రహస్యం.
