ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పునర్వికకు పునర్జన్మ కల్పించడంలో తన హామీ నిలబెట్టుకున్నారు. ఆ పాపకు అత్యంత ఖరీదైన ఇంజక్షన్ ప్రక్రియ పూర్తయింది. ఇదే విషయాన్నిలోకేష్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపి వందేళ్లు బతకాలని దీవించారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పావతి దంపతుల కుమార్తె పునర్విక . ఈ చిన్నారి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-1 అనే అత్యంత అరుదైన , ప్రమాదకరమైన జన్యుపరమైన వ్యాధితో జన్మించింది. ఈ వ్యాధి సోకిన పిల్లల కండరాలు క్రమంగా బలహీనపడి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈ చిన్నారి ప్రాణం నిలవాలంటే అమెరికా నుండి జోల్గెన్స్మా అనే ఇంజెక్షన్ తెప్పించాల్సి ఉంటుంది. దీని ధర అక్షరాలా రూ. 16 కోట్లు . ఒక సామాన్య కుటుంబానికి ఇది ఊహకందని భారం.
పునర్విక ప్రాణాలను కాపాడాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ జరిగింది. నెటిజన్లు, సెలబ్రిటీలు స్పందించి రూపాయి రూపాయి కలిపి దాదాపు రూ. 10 కోట్ల వరకు సేకరించారు. అయితే ఇంకా రూ. 6 కోట్లు తక్కువయ్యాయి. ఈ విషయం నారా లోకేష్ దృష్టికి వెళ్లగానే ఆయన వెంటనే స్పందించారు. ఫిబ్రవరి 2026లో చిన్నారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ, మిగిలిన రూ. 6 కోట్ల బాధ్యత తనదని మాట ఇచ్చారు. కేవలం నిధులు సర్దుబాటు చేయడమే కాకుండా, విదేశాల నుండి ఈ ఖరీదైన ఇంజెక్షన్ వేగంగా ఇక్కడికి చేరేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన అనుమతులు ఇప్పించారు.
తను ఇచ్చిన హామీ మేరకు, ఏప్రిల్ 18న పునర్వికకు ఆ రూ. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ విజయవంతంగా అందించారు. ఈ సందర్భంగానే లోకేష్ మాట నిలబెట్టుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. వందేళ్లు చల్లగా ఉండు చిట్టితల్లి అని దీవించిన ఆయన తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, ఒక పేద చిన్నారి ప్రాణం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇంజక్షన్ పూర్తయ్యే వరకు పర్యవేక్షించడం ఆయనలోని మానవతా దృక్పథానికి నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
