జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, పార్టీ కీలక నేత హరీష్ రావుతో పాటు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ పార్టీ తన మైండ్ గేమ్‌కు పదును పెట్టేందుకు అస్త్రంగా మార్చుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరుతూండటంతో, ఆ చేరిక ఇష్టం లేకే హరీష్ రావు ఈ కీలక సభకు దూరంగా ఉండి ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైందని జోస్యం చెప్పారు. హరీష్ రావు గైర్హాజరు వెనుక లోతైన రాజకీయ అంతరార్థం ఉందని, ఆయన భవిష్యత్తు ప్రణాళికలు త్వరలోనే బయటపడతాయని ఆయన చెప్పుకొచ్చారు. హరీష్ రావు లేకుండా కేసీఆర్ ఇంత పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన సందర్భాలు లేవని, ఇది పార్టీలో అంతర్గత విభేదాలకు సంకేతమని కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హరీష్ రావు ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ కారణాలు ఏవీ లేవని, కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు మరియు పార్టీ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించేందుకే వారు హస్తినకు వెళ్లారని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇటువంటి కట్టుకథలు అల్లుతోందని గులాబీ నేతలు మండిపడుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర ఉన్న జీవన్ రెడ్డి చేరిక అంశం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఒకవైపు, బీఆర్ఎస్ వివరణలు మరోవైపు ఉన్నప్పటికీ.. కేసీఆర్ సభ సాగుతున్న సమయంలోనే కీలక నేతలు ఢిల్లీలో ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇది నిజంగానే న్యాయపరమైన పర్యటననా లేక గులాబీ పార్టీలో రాబోయే పెను మార్పులకు సంకేతమా అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
