తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నామమాత్రపు సీట్లు గెలుచుకున్న చోట్ల సైతం భారత రాష్ట్ర సమితి తన ఉనికిని కాపాడుకోవడంలో విఫలమవుతోంది. ముఖ్యంగా కామారెడ్డి, కరీంనగర్ వంటి కీలక ప్రాంతాల్లో గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఫలితాలు రాగానే అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే ఈ వలసలు జరుగుతున్నాయా? లేక నాయకత్వంపై నమ్మకం లేక నేతలు గీత దాటుతున్నారా? అనే ప్రశ్నలు ఇప్పుడు సొంత పార్టీ శ్రేణులనే కలవరపెడుతున్నాయి.
కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం?
కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠం దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందంటూ ప్రచారం జరుగుతోంది. తాజా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కరీంనగర్ కార్పొరేషన్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు . మొత్తం 66 డివిజన్లలో బిజెపి 30 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు 8 మంది కీలక పాత్ర పోషిస్తున్నారు. బిజెపిని మేయర్ పీఠానికి దూరం చేసేందుకు కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎం కలిసి పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి తగ్గట్లుగానే కాంగ్రెస్ కార్పొరేటర్లు క్యాంపులకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ తమ కౌన్సిలర్లను బెదిరింపులకు గురిచేస్తోందని కేటీఆర్ అంటున్నారు. ఆయన మాటలు అనుమానాస్పదంగానే ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
దిగువస్థాయి క్యాడర్ను అదుపులో పెట్టుకోలేరా?
తిరుగులేని శక్తిగా వెలిగిన బీఆర్ఎస్, ఇప్పుడు తన సభ్యులపై కనీస నియంత్రణ కోల్పోవడం ఆ పార్టీ భవిష్యత్తుకు పెను ప్రమాదకరంగా మారింది. గెలిచిన కొద్దిపాటి స్థానాలను కూడా కాపాడుకోలేకపోతే, ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ కేవలం అధికార పార్టీలకు ఒక అనుబంధ సంస్థలా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షంగా నిలబడాల్సిన సమయంలో, గెలిచిన నేతలు ఇలా పరాయి గూటికి చేరడం వల్ల ఓటర్లలో పార్టీపై విశ్వసనీయత సన్నగిల్లుతుంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే జీహెచ్ఎంసీ, ఇతర ఎన్నికల్లో పార్టీకి కోలుకోలేని నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
కేటీఆర్ పార్టీపై గట్టి పట్టు చూపించాల్సిన సమయం
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన దూకుడును కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ కట్టడిపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ ఫలితాలు హంగ్ గా వచ్చిన 37 చోట్ల వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ కేటీఆర్ తన నేతలను అదుపులో ఉంచుకోవడంలో విఫలమవుతున్నారనే సంకేతాలు వెళ్తున్నాయి. ఇది పార్టీ కేడర్లో తీవ్ర నైరాశ్యాన్ని నింపుతోంది.నతమ పార్టీ నేతలపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం, గెలిచిన అభ్యర్థులకు భరోసా కల్పించలేకపోవడం పార్టీ ఉనికికే ఎసరు పెడుతోంది. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ మేల్కొని, గీత దాటే నేతలపై కఠినంగా వ్యవహరించకపోతే.. నాయకత్వం చులకన అయ్యే అవకాశం ఉంది.
