కేటీఆర్ చెప్పిన ఈ పాయింట్ మీదే చ‌ర్చ అవ‌స‌రం..!

కాంగ్రెస్‌, భాజ‌పాల‌కు ప్ర‌త్యామ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక కొత్త కూట‌మి అవ‌స‌రం ఉంద‌నే చ‌ర్చ‌ను సీఎం కేసీఆర్ తీసుకొచ్చార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. భ‌విష్య‌త్తులో ఇది మంచి ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు. గ‌డ‌చిన మూడున్న‌రేళ్ల‌లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అద‌నంగా ఒక్క పైసా కూడా తెలంగాణ‌కి రాలేద‌ని చెప్పారు. పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో చెప్పిన అంశాల‌ను కూడా ఇవ్వ‌లేద‌న్నారు. ఈరోజున ఎన్డీయే కూట‌మిలో ఎవ్వ‌రూ మిగిలి లేర‌నీ, తెలుగుదేశం పార్టీ బ‌య‌ట‌కి వ‌చ్చేసిన త‌రువాత ఆ కూట‌మిని చూసుకుంటే.. బ‌ల‌హీనప‌డిన అకాలీద‌ళ్‌, భాజపా త‌ప్ప ఎవ్వ‌రూ లేర‌న్నారు.

కాబ‌ట్టి, ఈ ప‌రిస్థితిని కేంద్రం ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఎన్డీయేలో ఉన్న‌వారు ఒక్కొక్క‌రూ ఎందుకు బ‌య‌ట‌కి వెళ్తున్నారో వాళ్లే ప‌రిశీలించుకోవాల‌న్నారు. కాంగ్రెస్‌, భాజ‌పాల‌కి ఎన్నో సంవత్స‌రాలుగా ప్ర‌జ‌లు అవ‌కాశం ఇచ్చినా కూడా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయ‌ని ముఖ్య‌మంత్రి చెప్పార‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజ‌పా, కాంగ్రెస్ పూర్తిగా మెజారిటీ సాధించే ప‌రిస్థితుల్లో లేవ‌న్నారు. ఢిల్లీలో కేంద్రీకృత‌మైన పెత్త‌నాల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రాలు ఎంత శ‌క్తివంతంగా త‌యారైతే, దేశం అంత శ‌క్తివంతం అవుతుంద‌నీ, కానీ మొత్తం అధికారాలు కేంద్రం ద‌గ్గ‌ర పెట్టుకోవ‌డం ద్వారా దేశానికి న‌ష్టం జ‌రుగుతోంద‌న్నారు. ఈ త‌రుణంలో సీఎం కేసీఆర్ దేశ‌వ్యాప్తంగా ఒక మంచి చ‌ర్చ‌ను ఆహ్వానించార‌ని తాను భావిస్తున్న‌ట్టు చెప్పారు.

కేంద్రీకృత‌మైన కేంద్ర అధికారాల‌పై చ‌ర్చ జ‌ర‌గాలన్న‌ది క‌చ్చితంగా మంచి అంశ‌మే. రాష్ట్రాల‌న్నీ కేంద్రం చుట్టూ తిరగాల‌నీ, వారి ద‌యాదాక్షిణ్యాల‌తో మ‌నుగ‌డ సాగించాల‌నే నిరంకుశ ధోరణి భాజ‌పా హ‌యాంలో ఎక్కువైపోయింది. వారి ఆదేశాల‌కు త‌లొగ్గినవారిని ఒక‌లా, స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించాల‌నుకునేవారితో మ‌రోలా వ్య‌వ‌హ‌రించ‌డం అనేది భాజ‌పా నాయ‌క‌త్వానికి అలవాటైపోయింది. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద‌పీట వేయాల‌న్న రాజ్యాంగ్య స్ఫూర్తిని కూడా తుంగ‌లోకి తొక్కేస్తున్నారు. నిజానికి, భాజ‌పా, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయం అనే మాట కాస్త‌ ప‌క్క‌న‌పెట్టి… కేంద్రీకృత‌మైన కేంద్ర అధికారాల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ‌ను కాపాడే కూట‌మి అవ‌స‌రం జాతీయ స్థాయిలో ఉంద‌నే అభిప్రాయంతో కేసీఆర్ ముందుకుసాగాలి. ఆ చ‌ర్చను ఇత‌ర రాష్ట్రాల్లో కూడా లేవ‌నెత్త‌గ‌లిగితే… కాంగ్రెస్‌, భాజ‌పాల‌కు ప్ర‌త్యామ్నాయం అవ‌స‌రం అనే అభిప్రాయానికి మ‌ద్ద‌తు పెరిగే అవ‌కాశం క‌చ్చితంగా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.