ఉద్య‌మం అంటే ఎందుకంత ఉలికిపాటు..!

టీజేయేసీ నేతృత్వంలో కోదండ‌రామ్‌ చేప‌ట్టిన స్ఫూర్తియాత్ర‌ను అడుగ‌డుగునా అడ్డంకులే ఎదురౌతున్నాయి. అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌రకూ దాదాపు 3500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌ని కోదండ‌రామ్ ఆరోపిస్తున్నారు. ఉద్య‌మ సంఘ‌ట‌న‌ను గుర్తుచేసుకోవ‌డం నేరం కాద‌ని ఆయ‌న అన్నారు. ఏ ఉద్య‌మాల వ‌ల్ల తెలంగాణ వ‌చ్చిందో, ఇవాళ్ల ఆ ఉద్య‌మాలే నేర‌మ‌ని అంటే తెలంగాణే త‌ప్పు అవుతుంద‌న్నారు. నాటి ఉద్య‌మాల వెన‌క నీతి ఉంద‌నీ, ప్ర‌జ‌ల ఆకాంక్ష ఉంద‌నీ, దాని ఫ‌లితంగానే తెలంగాణ ఏర్ప‌డింద‌ని కోదండ‌రామ్ అన్నారు. అలాంటి ఉద్య‌మాల‌ను గుర్తు చేసుకోవ‌ద్దు అనేవారు నిరంకుశ పాల‌కులు అవుతార‌ని విమ‌ర్శించారు.

తెలంగాణ తెచ్చింది తామేన‌నీ, ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో త‌మ‌కు మాత్ర‌మే తెలుసు అనే ధోర‌ణిలో నేటి నిరంకుశ పాల‌కులు ఉన్నార‌న్నారు. తాము ప‌రిపాల‌న చేస్తాం, మిగ‌తావారంతా ప‌డి ఉండాల‌న్న పోక‌డ‌లు పోతున్నార‌న్నారు. త‌మ ఇష్టానుసారంగా అధికారం చెలాయిస్తామ‌నీ, ప్ర‌శ్నించ‌డానికి మీరెవ‌రండీ అనే ధోర‌ణిలో ఉన్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు నాటి ఉద్య‌మాలు గుర్తుకు రావ‌డం నేటి పాల‌కుల‌కు ఇష్టం లేద‌న్నారు. ఒక‌వేళ గుర్తుకొస్తే, పోరాడి తెచ్చుకున్న తెలంగాణ‌లో నేటి ప‌రిస్థితి ఏంటని ప్ర‌శ్నించుకుంటార‌నీ, మ‌రోసారి సంఘ‌టితమై భ‌విష్య‌త్తును నిర్ణ‌యించుకునే అధికారం మ‌న‌కు ఉంద‌నే సోయిలోకి వ‌చ్చి స‌మ‌ష్టిగా ఒక ప్ర‌య‌త్నం మొద‌లుపెడ‌తార‌నీ, అలాంటి ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వానికి ఏమాత్రం న‌చ్చ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఢిల్లీలో ధ‌ర్నాచౌక్ ఉండాలీ, పోరాటాలు జర‌గాల‌ని ముఖ్య‌మంత్రి అంటార‌నీ… కానీ, రాష్ట్రానికి వ‌చ్చేసరికి ఆ ప్ర‌జాస్వామ్య సోయి ప్ర‌జ‌ల‌కు ఉండ‌టం ఆయ‌న‌కి ఏమాత్రం ఇష్టం లేక‌పోవ‌డం దారుణం అని కోదండ‌రామ్ మండిప‌డ్డారు.

ఈ అంశం చినికిచినికి గాలివాన అన్న‌ట్టుగా మారుతున్న‌ట్టుంది. ఈ కార్యక్రమం మిలియిన్ మార్చ్ ను గుర్తు చేసుకోవ‌డం కోసమే అని కోదండ‌రామ్ చెబుతున్నా, దీని ద్వారా ప్ర‌భుత్వ వ్య‌తిరేక వాద‌న‌ల‌ను సంఘ‌టితం చేసిన‌ట్టు అవుతుంద‌ని అధికార పార్టీ భావిస్తున్న‌ట్టుగా ఉంది. అందుకే, ర్యాలీకి అనుమ‌తి ఇవ్వ‌లేదు. నిజానికి, ఓప‌క్క కేసీఆర్ మూడో ఫ్రెంట్ అంటూ జాతీయ స్థాయి రాజ‌కీయాల‌వైపు చూస్తే… ఇక రాష్ట్రంతో త‌మ‌కు తిరుగులేద‌నే భావ‌న క‌లిగించే ప్ర‌య‌త్నం చేశారు. రాజ‌కీయంగా చూసుకుంటే దాదాపు అలాంటి పరిస్థితే ఉంది. విప‌క్ష కాంగ్రెస్ నేత‌లు ఎంత తీవ్రంగా బ‌స్సు యాత్ర చేస్తున్నా, కేసీఆర్ స‌ర్కారుపై పోరాటం అంటూ ఎన్ని విమ‌ర్శ‌లు చేస్తున్నా.. ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన స్పంద‌నైతే క‌నిపించ‌డం లేదు. కానీ, కోదండ‌రామ్ త‌ల‌పెట్టిన యాత్ర‌ను అడ్డుకోవ‌డంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక స్వ‌రాన్ని తీవ్రంగా వినిపించేందుకు కావాల్సిన వాతావ‌ర‌ణాన్ని తెరాస సృష్టించిన‌ట్టు అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.